
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాజధానిపై మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆందోళన చేపట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బొత్స ఇంటి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
కేబినెట్ భేటీ అనంతరం…
మరోవైపు, ఏపీ రాజధాని అమరావతి, మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చించేందుకు కేబినెట్ కొద్దిసేపటి క్రితం భేటీ అయింది. అనంతరం ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, రాజధాని విషయంలో జరుగుతున్న ఆందోళనలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలుతుందని చెప్పారు. అమరావతి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రైతులను చంద్రబాబు మభ్య పెడుతున్నారని, ఆయన మాయలో పడొద్దని రైతులకు హితవు పలికారు.
టీడీపీ ప్రభుత్వం చేసినట్టు తాము ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరపబోమన్నారు. అమరావతిలో 50 శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తామని బొత్స భరోసా ఇచ్చారు.








