అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. వివిధ ప్రాంతాల్లో పరిణామాలు మారిపోతున్నాయి. ఎక్కడికక్కడే పందేలు ఊపందుకుంటున్నాయి. పోలింగ్ గతనెల 11నే ముగిసింది. మరో 16 రోజుల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో, ఎవరు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారో తేలిపోనుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అభ్యర్థులతో పాటు అటు ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు ఎలా ఉండవచ్చనే విషయమై అని ప్రధాన పార్టీల నాయకులు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు కూడా చేశారు.
ఎవరి లెక్కల్లో వారు…
స్థానిక నాయకులు గ్రామాలు, వార్డుల వారీగా ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. అక్కడితో ఆగకుండా జోరుగా బెట్టింగులు కాశారు. పోలింగ్ జరిగిన రెండు మూడు రోజుల్లో వేసిన పందేల కంటే ఎక్కువగా ప్రస్తుతం జరుగుతున్నాయి.
బొబ్బిలిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మాజీమంత్రి, ఎంపీ పి.అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. మే 23న వెలువడే ఫలితాల్లో జిల్లాలో ‘టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. 9 నియోజకవర్గాలు మనవే’ అంటూ టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపారు.
మరోవైపు వైసీపీ నాయకులూ అదే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య పందేలు, బెట్టింగులు జోరందుకున్నాయి. కొంతమంది అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్‌లకు దిగుతుండడం విశేషం. ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాంలో కూడా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి.
ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల జాతకాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ కేంద్రాల వారీ సర్వేలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు గ్రామాలు, వార్డుల్లో పట్టున్న నాయకులు పార్టీకోసం ఏమేరకు పనిచేశారో కూడా తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే నియోజకవర్గ ముఖ్య నాయకుడు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. విజయం మనదే అని భరోసా కల్పించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచిన కట్టప్పల లెక్కలు తేల్చుతున్నారు.
మరోవైపు పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించడం, వచ్చే ఎన్నికల్లో వారికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, చైర్పర్సన్ పదవుల సీట్లతో పాటు కేడర్ బట్టి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు కూడా కట్టబెట్టేందుకు టీడీపీ అధిష్టానం యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో అన్ని పోలింగ్ బూత్‌లలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకుల మధ్య పందాలు ఊపందుకుంటున్నాయి.
చదవండి: ‘పీకే’పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధాన పార్టీలు! గెలిచేదెవరు? ఓడేదెవరు?
టీడీపీ నాయకులు పసుపు-కుంకుమ(పీ.కే) పైనే ఆశలు పెట్టుకోవడం విశేషం. ఈ ఐదేళ్ల పాలనలో వందకుపైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు పారదర్శక పాలన, రాష్ట్రాభివృద్ధితో పాటు మూడు నెలల కిందట అమలు చేసిన పసుపు కుంకుమపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
మహిళలకు అన్నగా చంద్రబాబు ఆదరించి పసుపు కుంకుమ సాయం చేశారని, ఆయనకు అండగా ఉంటామని మహిళలు బహిరంగంగా చెప్పారు. ఓటుకూడా టీడీపీకే వేస్తామని తెలిపారు.
అన్ని నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం, ఓటింగ్ శాతం పురుషుల కంటే మహిళలది ఎక్కువగా ఉండటం వెరసి పసుపు కుంకుమ టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక పతిపక్షం వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన వేసిన పాచికలు పారాయని, జగన్ పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఆ ధీమాతోనే పందాలు కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసిన జనసేన పార్టీ నాయకులు కూడా పార్టీ అధ్యక్షుడు పీకే (పవన్ కళ్యాణ్)పైనే ఆశలు పెట్టుకున్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయ రాజకీయం కోసం పవన్ కల్యాణ్ పార్టీకి ఓటేశారని ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థులు పీకేపై ఆశలు పెట్టుకున్నారు. ఆ నమ్మకంతోనే అక్కడక్కడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పందాలు కాస్తున్నారు. ఏ పార్టీ నాయకుల ఆశలు తీరుతాయో తేలాలంటే మరో 16 రోజులు వేచిచూడక తప్పదు.








