
విజయవాడ: తెలంగాణలో పోర్టు లేదు కాబట్టే తెలంగాణకు తయారీ రంగ పరిశ్రమలు రావడం లేదని, తెలంగాణలో డ్రై పోర్టు పెట్టుకుని, ఏపీలోని బందరు పోర్టును టేకోవర్ చేసి కారిడార్ ఏర్పరచుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన అని, ఆ మేరకు ఆయన ప్రధాని మోడీకి లెటర్ కూడా రాశారని, ఆ లెటర్ కాపీ తన వద్ద ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో లోకేశ్ ఇంకా పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో 150 గెల్చుకోవడమే తమ మిషన్ అని, అది సాధించి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే…
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారని, మరి ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటో ప్రజలకు చెప్పాలి కదా అని లోకేశ్ ప్రశ్నించారు. అంతేకాదు.. ‘‘మేం తెలుసుకున్నాం ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏమిటో. ఆయన ప్రచార రథాలను పంపించారు. పైన రంగులు మార్చారుకానీ లోపల మాత్రం గులాబి రంగు సీట్లే ఉన్నాయి..’’ అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్ర రాష్ట్రంపై కుట్ర రాజకీయాలు…
ఆంధ్రులపైన కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని కూడా నారా లోకేశ్ ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు జోక్యం చేసుకుంటున్నారని, అసలు ఇక్కడి రాజకీయాలతో వారికేం పని అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు ఇక్కడేం పని?
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇక్కడ ఏం పని? అని లోకేశ్ ప్రశ్నించారు. ఆయన పోలవరాన్ని ఆపాలని, ముంపు మండలాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ప్రధాని మోడీకి లేఖ రాసి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోర్టును తమకు ఇవ్వాలని ఆయన కోరారని తెలిపారు. ఇక్కడి పోర్టులో పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వాటిని టేకోవర్ చేయాలని చూస్తోందని అన్నారు.
‘‘మంత్రి పదవి ఊరికే రాలేదు…’’
2009, 2014 ఎన్నికల్లోనూ తాను పార్టీ కోసం పని చేశానని, తరువాత పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగానికి సమన్వయ కర్తగా పని చేశానని, ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ప్రభుత్వంలో అవకాశం కల్పించారని లోకేశ్ చెప్పుకొచ్చారు.
గత అయిదేళ్ళలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను కూడా తీసుకొచ్చామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. .
ఎన్నికల్లో ఎమోషన్స్ సహజమే…
ఏ ఎన్నికలైనా ఎమోషన్స్, సెంటిమెంటుతోనే జరుగుతాయని లోకేశ్ అన్నారు. కానీ, రాష్ట్రంలో ఏం జరుగుతోంది?… ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?.. వారికి ఇక్కడి రాజకీయాలతో ఏం పని?… ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం తమకు ఉందని అన్నారు.
ఇక ప్రశాంత కిశోర్ ఎలక్షన్ కన్సల్టెంట్ అని, బీహార్ నుంచి వచ్చారని, ఎన్నికలు ముగియగానే ఆయన వెళ్లిపోతారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
‘‘పవన్ రూటెందుకు మార్చారో తెలియదు…’’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత కూడా ఆయన తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తాము పరిష్కరించే ప్రయత్నం చేశామని నారా లోకేశ్ చెప్పారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ రూటు మర్చారని, ఎందుకో తమకు తెలియదని వ్యాఖ్యానించారు.
గ్రోత్ రేట్‌లో ఏపీ దేశంలోనే ఫస్ట్…
ఏపీ గ్రోత్ రేట్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఏపీలో అభివృద్ధి వేగంగా సాగుతోందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. తాము ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, 2022 నాటికి దేశంలోని టాప్ -3 రాష్ట్రాలలో.. ఏపీ ఒకటిగా ఉండాలని, 2029 నాటికి నంబర్ వన్ స్టేట్ కావాలన్నది తమ లక్ష్యం అని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా తాము మంచి ఎక్కడున్నా తీసుకుంటామని, తెలంగాణ నుంచీ నేర్చుకుంటాం.. కర్నాటక, తమిళనాడుల నుంచి కూడా నేర్చుకుంటాం.. అని ఆయన వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు మంచి ఆలోచనే, కానీ..
నోట్ల రద్దు మంచి ఆలోచనే.. కానీ, మరింత పెద్ద నోట్లు తేవడం మాత్రం సరైన పని కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ దేశానికి ఎక్కువలో ఎక్కువ రూ.200 నోటు ఉంటే సరిపోతుందని ఆయన అన్నారు. సంక్షేమానికి సంబంధించి అన్ని మాడల్స్‌ను తాము పరిశీలిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పథకాలను స్టడీ చేస్తుంటామని చెప్పారు.
ఆ విషయంలో ఏపీదే విజయం…
ముఖ్యమంత్రి యువనేస్తం, నిరుద్యోగ భృతి పెట్టాలని దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రయత్నించాయని,. కానీ, సక్సెస్ కాలేదని, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే విజయం సాధించిందని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇక ఉద్యోగాల కల్పన విషయానికి వస్తే, ఇప్పటికే మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించామని, రాబోయే రెండున్నరేళ్ళలో మరో 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు.








