26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణమా?: ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

ఇంత దారుణమా?: ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

- Advertisement -

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు గాంధీ భవన్‌లో ఆ పార్టీ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కతో కలిసి సోమవారం ఉత్తమ్‌ మీడియాకు వెల్లడించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో వారి కోరిక మేరకు టీఆర్ఎస్‌కు తాము మద్దతిచ్చామని ఉత్తమ్‌ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రాగానే వికృత రాజకీయాలకు దిగజారారని టీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్‌.. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని.. టీడీపీ, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఉత్తమ్, భట్టి విక్రమార్క మండిపడ్డారు.

గ్రామస్థాయి ఎన్నికలకంటే దారుణం..

కేసీఆర్ వికృత రాజకీయాలపై దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. పెద్దల సభ ఎన్నికల వ్యవహారం అంటే హుందాగా ఉండాలని, గ్రామస్థాయి ఎన్నికలకంటే పరిస్థితి దారుణంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.

కాగా, తమ పార్టీతోపాటు టీడీపీకున్న ఇద్దరు ఎమ్మెల్యేల సంఖ్యతో ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావించిన కాంగ్రెస్‌ పార్టీ గూడూరి నారాయణ రెడ్డిని బరిలోకి నిలిపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

అంతేగాక, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని స్పష్టత రావడంతో పార్టీని వీడే వారి సంఖ్య అయిదుకు చేరింది. దీంతో కాంగ్రెస్‌ బలం 19 నుంచి 14కి తగ్గనుంది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. కాగా, మార్చి 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

 

- Advertisement -