
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పదించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఓటర్లు మార్పును ఆశించి వైసీపీకి ఓటు వేశారని తెలిపారు.
అయితే ప్రజాతీర్పును గౌరవిస్తున్నామనీ, ఓటమిని అంగీకరిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాకపోతే టీడీపీలో ఈసారి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంగీకరించారు. ఒకవేళ వారిని మార్చి ఉంటే కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉండేవాళ్లమని చెప్పారు.
తమ పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం కావడం నిజంగా దురదృష్టకరమని, చంద్రబాబు దేవుడిలాంటి మనిషి అనీ, రోజుకు 18 గంటలు పనిచేసి సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు.ఇక జగన్, చంద్రబాబుకు ఓ తేడా ఉందని, ఎవరైనా పార్టీ అభ్యర్ధి గెలవడు అని అనిపిస్తే జగన్ సదరు నేతలను తీసిపడేశారని, కానీ చంద్రబాబు మంచితనం కారణంగా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొనసాగించారని చెప్పారు.
చంద్రబాబు మంచితనమే ఇప్పుడు పార్టీ కొంపముంచిందని, అయితే ఆయన జనం అనుకున్నంత కఠినమైన మనస్తత్వం ఉన్నావాడు కాదని అన్నారు. వాస్తవానికి 50-60 మంది సిట్టింగ్ లను మార్చాలని అనుకున్నా, మొహమాటం కారణంగా ఆయన తప్పించలేకపోయారు. ఈ ఒక్క కారణంగానే టీడీపీ ఓడిపోయిందని చెప్పారు.
చదవండి: వైఎస్ జగన్ కేబినెట్‌లో.. మంత్రులుగా చాన్స్ దక్కేదెవరికి?








