
తిరుపతి: తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పృథ్వీ తాజాగా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు.
‘‘నా మీద లేనిపోనివి ప్రచారం చేశారని పార్టీ అధిష్ఠానానికి చెప్పాను. ఒకవేళ ఆ వాయిస్ నాదైతే.. ఆఫీసులో అలా ప్రవర్తించాడా?.. లేకపోతే అవుట్‌సైడ్ అలా మాట్లాడుకున్నారా? అని ఆలోచిస్తారు. విచారణలో పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రైతు కష్టాల గురించి నాకు తెలుసు. నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా..’’ అని ఆ సందేశంలో ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, ‘‘పోసాని కృష్ణమురళితో కమ్యూనికేషన్ గ్యాప్‌ను.. ఇతర పార్టీల వారు ఉపయోగించుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించారని..35 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చేసిన ఆరోపణలు నిరాధారం. యూనియన్లతో గొడవలు పడాల్సిన అవసరం నాకు లేదు..’’ అని కూడా పృథ్వీ అందులో వివరించారు.
పృథ్వీపై టీటీడీ వేటు…
కాగా, ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యంగా మాట్లాడడంపై తీవ్రంగా స్పందించిన టీడీడీ అతడిపై వేటు వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాజీనామా చేయాలని పృథ్వీకి టీటీడీ అధికారులు ఆదేశాలిచ్చారు.
రాజధాని రైతులపై దారుణ వ్యాఖ్యల తర్వాత పృథ్వీని దేవుడే శిక్షించాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో కూడా కలకలం రేగుతోంది. రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందని పృథ్వీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.








