సంచలనం: జనసేనకు షాక్, కవాతుకు పోలీసుల అనుమతి నిరాకరణ, బ్యారేజిపై ప్రమాదమంటూ…

- Advertisement -

janasena kavathu2

రాజమండ్రి: జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.  ధవళేశ్వరం బ్యారేజిపై జనసేన కవాతుకు అనుమతి నిరాకరించారు.  బ్యారేజిపై కవాతు చేయడం ప్రమాదమన్నారు. మరో చోట నిర్వహించుకోమని సూచించారు. దీంతో జనసేన శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.

చదవండి: నేడే ‘జనసేన’ కవాతు.. కదం తొక్కనున్న రెండు లక్షల మంది జన సైనికులు!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో దాదాపు 2 లక్షలమంది జనసైనికులతో ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజిపై కవాతుకు జనసేన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం వరకూ చేపట్టనున్న ఈ కవాతు దాదాపు 1.30 గంటల పాటు కొనసాగనుంది.  ఈ నేపథ్యంలో ఇప్పటికే జన సైనికులు భారీగా అక్కడికి  చేరుకుంటున్నారు.

అంతేకాకుండా, సాయంత్రం 4.30 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం సమీపంలో భారీ బహిరంగ సభకు జనసేన ప్లాన్ చేసింది. దీనికి  సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ శ్రేణులు, వలంటీర్లు పూర్తి చేశారు.

janasena kavathu

జనసైనికుల కవాతు ఇలా…

జన సైనికులు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయనున్నారు. ఈ కవాతులో పార్టీ జెండాతో కూడిన ప్రత్యేక వస్త్రధారణ కలిగిన 10 వేల మంది పవన్‌ కళ్యాణ్ వెనక నడుస్తారు. మిగిలిన శ్రేణులు, అభిమానులు 2 లక్షల మంది ఈ కవాతులో పాల్గొననున్నారు.  కవాతులో పాల్గొనటానికి వస్తున్న వారికి పార్కింగ్‌ స్థలాలను సైతం సిద్ధం చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వారి కులవృత్తులను ప్రతిబింభించేలా పనిముట్లతో కవాతులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని సమన్వయకర్త కందుల దుర్గేష్‌ తెలిపారు.

ముందు జాగ్రత్తగా…

బ్యారేజీపై కవాతు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు కూడా జనసేనాని తీసుకున్నారు.   బ్యారేజీ కింద గోదావరిలో దాదాపు 200 మంది గజ ఈతగాళ్లు, 15 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. పార్టీ నియమించిన 1500 మంది వలంటీర్లతో పాటు ప్రభుత్వం తరఫున పోలీసులు కూడా బందోబస్తుకు రానున్నారు.

అసలు అనుమతే ఇవ్వని పోలీసులు…

అయితే ధవళేశ్వరం బ్యారేజీపై వేలాది మందితో కవాతు నిర్వహించడం ప్రమాదకరమని పేర్కొంటూ పోలీసులు ఈ కవాతుకు అనుమతి నిరాకరించారు. అలాగే బ్యారేజి కింద స్థలంలో  బహిరంగ సభ నిర్వహణ  కూడా ప్రమాదకరమని వారు సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా బ్యారేజిపై వేలాది మందితో కవాతు నిర్వహించడం ప్రమాదమని, ఇది పురాతన కట్టడమైనందున ఊహించని ఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ మేరకు వారు పోలీసులకు లేఖ రాయడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు.  దీంతో కవాతును నిర్వహించరాదంటూ జనసేన శ్రేణులకు నోటీసులు జారీ చేశారు.  కవాతు, బహిరంగ సభలను మరో ప్రాంతంలో నిర్వహించుకోవాలని ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన జనసేన శ్రేణులకు శరాఘాతంలా మారింది. ఎన్నో సన్నాహాలు చేసుకుని, తీరా సోమవారం కవాతుకు సిద్దమవుతున్న తరుణంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన ప్రత్యామ్నాయం  ఆలోచిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -