25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, చంద్రబాబు, జగన్‌లపై ఏమన్నారంటే…

దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, చంద్రబాబు, జగన్‌లపై ఏమన్నారంటే…

janasena-chief-pawan-kalyan-sensational-comments
- Advertisement -

pawan-in-guntur-tour

గుంటూరు: సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని, మామను వెన్నుపోటు పొడిచి పార్టీని నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు అంటూ జనసేనాని దుయ్యబట్టారు. భావితరాలకు ఈ రెండు పార్టీలపై ఎప్పటికీ ఇదే అభిప్రాయం ఉంటుందన్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

అంతేకాదు, 2014 ఎన్నికల్లో టీడీపీకి తాను మద్దతు ఇచ్చింది తనకు పోటీచేయడం చేతగాక కాదని, రాష్ట్రం బాగుండాలని గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే.. పూర్తిగా అవినీతిలో మునిగితేలుతున్నారని పవన్‌ కళ్యాణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు తాజాగా రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రాజకీయాలు అసహ్యంగా, నీచంగా తయారయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 30 ఏళ్లు పాలించాలని జగన్, మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. అధికార దాహం తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదని విమర్శించారు. 25 కిలోల బియ్యం కాదని.. యువకులు 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారని చెప్పారు.

పవన్ సంక్రాంతి సంబరాలు… 

అంతకుముందు తెనాలి మండలం పెదరావూరులోని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌, రావెల కిషోర్ బాబు, మాదాసు.. ఇతర నేతలు పాల్గొన్నారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

జనసేన పార్టీ ఆశయాలు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ‘జాగోరే జాగో’ విభాగాన్ని పవన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెదరావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

‘‘మార్పు కోసం ప్రాణమిస్తా..’’

ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవని.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం కాదని.. అవినీతి జరిగితే బయటకొచ్చి ప్రశ్నించాలని యువతకు పవన్ పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు మన నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మార్పు కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

కులమతాల కోసం కాదని.. అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి పునాదుల మీద పార్టీలు పెట్టిన నేతలు నేడు ప్రజలను పీడిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీ పెట్టి రూ.లక్ష కోట్లు, లక్షన్నర కోట్లు దోచుకోవడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు.

రైతులకు కష్టాలు తప్ప సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదంటూ జనసేనాని దుయ్యబట్టారు.  రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ, వైసీపీ రెండు విఫలమయ్యాయని పవన్ ఆరోపించారు. త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు.

- Advertisement -