
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఒక పత్రిక పెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక సీటుని మాత్రమే గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో నేడు అమరావతిలో పార్టీ ఓటమిపై నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పవన్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని భావించి. త్వరలోనే పత్రికని పెడుతున్నట్లు ప్రకటించారు.
ఇందులో పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కథనాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పాటు అందించాలన్నారు.
ఇక పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షికలు ఉండాల్సిన అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
చదవండి: ఇక చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు: టీడీపీ నేత








