అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం కీలక ప్రకటన చేశారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తమ కుటుంబానికి రెండు సీట్లు కోరామని తెలిపారు.
ఒక వేళ పార్టీ కాదంటే..
అనంతపురంలో బుధవారం సునీత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. ఒక వేళ రెండు సీట్లు ఇవ్వని పక్షంలో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.
రాప్తాడు నుంచి ఇక తాను పోటీ చేయనని ఆమె చెప్పారు. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని గురువారం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పరిటాల సునీత తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయం మేరకు తమ కార్యాచరణ ఉంటుందని పేర్కన్నారు.
కాగా, గత ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో శ్రీరామ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మంత్రిగా తల్లి సునీత ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయాల్లో కార్యకర్తలకు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటూ టీడీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. అయితే, చంద్రబాబు.. వీరిద్దరికీ టికెట్ ఇస్తారా? లేక ఒక్కరికే ఇస్తారా? అనేది వేచి చూడాలి.








