అక్కో పార్టీ, అన్నో పార్టీ, తమ్ముడో పార్టీ.. మాడుగులలో విచిత్రం!

- Advertisement -

విశాఖపట్టణం: జిల్లాలోని మాడుగులలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఒకే ఇంట్లోని ముగ్గురు మూడు ప్రధాన పార్టీల్లో కొనసాగుతుండటమే. అందులో ఇద్దరు జనసేన, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలిచారు కూడా.

జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబాల్లో గవిరెడ్డి ఫ్యామిలీకి పెద్ద చరిత్రే ఉంది. చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో గవిరెడ్డి దేముడుబాబు, సన్యాసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు కాగా, వారిలో తొలి ముగ్గురూ మూడు పార్టీల్లో ఉండి, ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. టాలీవుడ్ నటి, ఎన్నో సినిమాల్లో నటించిన సుజాత అలియాస్ రమ్యశ్రీ వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.

రమ్యశ్రీ తమ్ముడు సన్యాసినాయుడు జనసేన నుంచి, మరో తమ్ముడు రామానాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్లను పొంది మాడుగులలో నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో అన్న తెలుగుదేశం తరఫున మాడుగుల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన గవిరెడ్డి సన్యాసినాయుడు, వైసీపీలో చేరి, ఆ పార్టీ టికెట్ ను ఆశించారు. జగన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు.

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన గవిరెడ్డి రామానాయుడు, 2014లో ఓడిపోయారు. అయినప్పటికీ, ఆయనపై ఉన్న నమ్మకంతో చంద్రబాబునాయుడు మాడుగుల టికెట్ ను ఆయనకే ఇవ్వడంతో మరోసారి తెలుగుదేశం తరఫున బరిలో ఉన్నారు. దీంతో మాడుగులలో ఒకే ఇంటికి చెందిన సోదరులు పోటీలో ఉండటం ఆసక్తి రేపుతోంది.

- Advertisement -