
కర్నూలు: కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 కు పెరిగింది. చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 14,380కు పెరిగింది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయి.
చైనాలో చిక్కుకున్న భారత విద్యార్థులను తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. నిన్న ఉదయం 324 మంది విద్యార్థులతో విమానం ఢిల్లీకి చేరుకుంది. అయితే, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం శ్రుతి అనే యువతి సహా మరికరికి విమానం ఎక్కేందుకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో వీరు వూహాన్‌లోనే ఉండిపోయారు.
శిక్షణ కోసమని మూడు నెలల క్రితం చైనా వెళ్లింది. తనకు కరోనా వైరస్ లక్షణాలు లేకున్నా, అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదంటూ తల్లికి పంపిన వీడియోలో శ్రుతి ఆవేదన వ్యక్తం చేసింది. తినడానికి ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంది. తన కుమార్తెను రక్షించి స్వదేశం తీసుకురావాల్సిందిగా శ్రుతి తల్లి ప్రభుత్వాన్ని వేడుకుంది.








