
మంగళగిరి: జనసేనకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల వైసీపీకి దగ్గరయ్యారు. పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. వైసీపీకి ఆయన దగ్గరైనప్పటికీ పవన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా, రాపాకపై పవన్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
తమకు ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదీ, లేనిదీ తెలియడం లేదన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నాయకులతో శనివారం పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ ఈ వాఖ్యలు చేశారు. అయినా తాను కాపలా కాసుకొని కూర్చొనే రాజకీయాలు చేయలేనన్నారు.
భావజాలంతో వచ్చిన వ్యక్తులు ఉంటారు, భావజాలంతో రాని వ్యక్తులు వెళ్ళిపోతారు
– JanaSena Chief @PawanKalyan pic.twitter.com/zyYKyGeWzu— JanaSena Party (@JanaSenaParty) February 1, 2020
ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చి, ఇప్పుడు తన పద్ధతి బాగులేదని వెళ్లిపోయే వారి మాటలను తాను పట్టించుకోబోనన్నారు. ఇష్టంతో పార్టీలో ఉండాలి కానీ బలవంతంగా పార్టీలో ఉండమని ఎవరికీ చెప్పనని పేర్కొన్నారు. కేవలం ప్రజా ప్రయోజనాలు, సమాజహితం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు.
అధికారం కోసం అర్రులు చాచేరకం కానని, అడ్డదారులు తొక్కబోనని, ఎవరి మోచేతి నీళ్లు తాగనని పవన్ అన్నారు. ఏ ఆశయంతోనైతే పార్టీ పెట్టానో దానిని సాధించే వరకు వెనకడుగు వేయబోనన్నారు. కష్టనష్టాలను భరిస్తానని, విలువలు, జనసైనికుల నమ్మకాలను పోగొట్టుకోనని హామీ ఇచ్చారు.
తనపై ఆధారపడిన కుటుంబాల కోసం, తన కుటుంబం కోసం సినిమాలు చేస్తున్నానట్టు పవన్ వివరించారు. రాజకీయాల్లో అడ్డదారులు తొక్కి తన కుటుంబాన్ని పోషించుకోలేనని, అలా చేస్తే తన మీద తనకే గౌరవం పోతుందని అన్నారు.








