వీసా స్కాం: పోలీసుల అదుపులోనే 129 మంది భారతీయులు, సాయం కోసం భారత ఎంబసీ హాట్‌లైన్…

us- visa scam
- Advertisement -

 

Farmington-Hills-Fake-University

వాషింగ్టన్‌: అమెరికాలో చోటు చేసుకున్న నకిలీ విద్యార్థుల వీసా కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో చిక్కుకున్నది ఎక్కువగా తెలుగువారే కావడం సంచలనంగా మారింది. విద్యార్థి వీసా ముసుగులో వందల మంది విదేశీయులకు అమెరికాలో అక్రమంగా నివసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించిన 8 మంది ఏజెంట్లను ఇప్పటికే అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

చదవండి: షాకింగ్: అమెరికాలో కాలేజీ స్కాం.. వందలాది భారతీయుల అరెస్ట్, అత్యధికులు తెలుగువారే…

నకిలీ విద్యార్థి వీసాలతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్న 130 మంది విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరిలో 129 మంది భారతీయులేనని అధికారులు తాజాగా వెల్లడించారు. మొదట వందలాది మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కొందరిని విచారించి వదిలేసినట్లు తెలుస్తోంది.

కాగా, అరెస్టయిన భారతీయ విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం 24 గంటల పాటు పనిచేసే హాట్‌లైన్‌ను తెరిచింది. విద్యార్థులు, వాటి కుటుంబసభ్యులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఓ నోడల్‌ అధికారిని కూడా నియమించింది.

ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుష్మా స్వరాజ్…

టెక్సాస్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్న భారత విద్యార్థులను భారత కాన్సులేట్‌ అధికారులు కలిశారు. విద్యార్థులకు అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అరెస్టైన తెలుగు విద్యార్థులకు అండగా ఉండేందుకు అమెరికా తెలుగు సంఘాలు కూడా రంగంలోకి దిగి తమవంతుగా సాయం అందిస్తున్నాయి.

భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నామని, అదే తమ మొదటి ప్రాధాన్యమని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు.

కాగా, అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు ప్రారంభించిన ఫార్మింగ్‌టన్‌ యూనివర్శిటీ నకిలీదని విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఫెడరల్‌ అధికారుల తీరును తప్పుబట్టారు.

అమెరికాలో కొన్ని యూనివర్శిటీలు తొలి రోజునుంచే కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తాయని, ఇది కూడా అలాంటిదేనని భావించి విద్యార్థులు చేరినట్లు తమకు తెలిసిందని అట్లాంటా అటార్నీ మైఖేల్‌ సోఫో వివరించారు.

- Advertisement -