
‘
అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు బాలకృష్ణ బహిరంగంగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది.
మరోవైపు ఈ వ్యాజ్యంలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
బహిరంగంగా డబ్బులు పంచారు..
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ నాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ ఆగస్టు 2017లో హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నేపథ్యంలో బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వ్యాజ్యంలో బాలకృష్ణ వాదనలు తెలుసుకోవడం తప్పనిసరని భావించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4వారాలకు వాయిదా వేసింది.








