
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ‘రివర్స్ టెండరింగ్’ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు షాక్ ఇచ్చింది. జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానంపై ముందుకు వెళ్లకూడదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు, ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను, ఈ ప్రక్రియ ద్వారా చేపడుతోన్న పనులను కూడా నిలిపివేయాలంటూ ఆ మధ్యంతర ఉత్తర్వులలో హైకోర్టు పేర్కొంది. అయితే ఒక్క జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలోనే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పనులకు వెళ్లకూడదని, పోలవరం హెడ్ వర్క్స్ విషయంలో ఈ తీర్పుకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తమకు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా మళ్లీ పనులను పిలవడంపై నవయుగ కంపెనీ ఈ నెల 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చే వరకు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులకు కట్టబెట్టరాదని కూడా సూచించింది.
అసలేం జరిగిందంటే…
పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
మరోవైపు ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఈ నెల 17వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రాల పనులకు మళ్లీ టెండర్లను పిలిచింది. రూ.4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్కు రూ.1,800 కోట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు రూ.3,100 కోట్లకు టెండర్లను ఆహ్వానించారు. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం జగన్ ప్రభుత్వం ఈ రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.
దీంతో నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ఏపీ జెన్కో తమకు స్థలం చూపని కారణంగానే జల విద్యుత్ ప్రాజెక్టు పనులు ఆలస్యమైనట్టు నవయుగ కంపెనీ హైకోర్టుకు తెలిపింది.
‘‘ఏపీ జెన్ కో స్థలం చూపకపోతే తప్పు మాదా?’’
తమ కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమంగా ప్రాజెక్టు పనులు నిర్వహించిందని పేర్కొంటూ.. ఏపీ జెన్ కో స్థలం చూపకుండా ఆలస్యం చేస్తే ఆ తప్పు తమది ఎలా అవుతుందంటూ వాదించింది.
మరోవైపు ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ మాట్లాడుతూ.. ఏపీ జెన్ కో స్థలం ఇవ్వకుండా ఆలస్యం చేస్తే కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయకూడదని నవయుగ కంపెనీ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానంపై ముందుకు వెళ్లకూడదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చే వరకు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులకు కట్టబెట్టరాదని కూడా సూచించింది.








