
హైదరాబాద్: మొన్నటివరకు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారో అందరికీ తెలుసు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక జగన్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టి…పాలనలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు నిన్న గుంటూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందుపై అన్నీ వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి.
జగన్ తన ప్రమాణస్వీకారానికి రూ.29 లక్షలు మాత్రమే ఖర్చుగా చూపారని, అంతకంటే తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరైన ఇఫ్తార్ విందుకు మాత్రం రూ.1.8 కోట్లు ఖర్చుగా చూపడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. భారతదేశం లౌకికవాద దేశమని, ఇలాంటి దేశంలో ప్రత్యేకంగా ఓ మతపరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించడం సరైన విధానం కాదని విమర్శించారు. ఇక మున్ముందు జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనే భావిస్తున్నామని స్పష్టం చేశారు.
అయితే ఏపీ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం అని, గత సీఎం చంద్రబాబు పోరాటాలు, ధర్నాలను సైతం విలాసవంతంగా మార్చేసి ఖజానాకు గండికొట్టారని,. ఇప్పుడు జగన్ ఆయన బాటలో నడవరనే ఆశిస్తున్నానని జీవీఎల్ ట్వీట్ చేశారు.








