
అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని స్ఫష్టం చేశారు.
ప్రభుత్వ టెండర్లలో అవినీతికి తావులేకుండా, లోపాయికారీ ఒప్పందాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.
అటు విభజన హామీలను అమలు చేస్తామని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని, నవరత్నాలను అమలు చేస్తామన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తామని, వచ్చే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తామని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, అమ్మ ఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం అందజేయనున్నట్టు చెప్పారు.
ఇక రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌అందిస్తామని గవర్నర్ తెలిపారు. అవినీతిరహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని , ఇందులో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చామని గవర్నర్ స్పష్టం చేశారు.








