ఎంవీవీఎస్ మూర్తి ప్రస్థానం: ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి.. టీడీపీలో క్రియాశీలకంగా…

gitam-university-mvvs-murthy
- Advertisement -

gitam-university-mvvs-murthy

అమరావతి: గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపక అధినేత, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీఎస్‌ మూర్తి మంగళవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట అమెరికాకు వెళ్లిన ఎంవీవీఎస్ మూర్తి, అక్టోబరు 6న అక్కడ జరగబోయే గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం… ‘గీతం’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

మూర్తితోపాటు మరో నలుగురు కాలిఫోర్నియా నుంచి అలాస్కాకు కారులో వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహానాన్నిఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం అయిదుగురిలో నలుగురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో కోలుకొంటున్నారు.

‘గోల్డ్‌స్పాట్ మూర్తి’గా…

ఎంవీవీఎస్ మూర్తి ‘గోల్డ్‌స్పాట్ మూర్తి’గా తెలుగువారికి సుపరిచితులు. 1938 జులై 3న తూర్పుగోదావరి జిల్లా మూలపొలం గ్రామంలో జన్మించిన మూర్తి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ డిగ్రీ పొందారు. న్యాయవాదిగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.ఈయన ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇదీ రాజకీయ ప్రస్థానం…

తొలిసారి 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. రెండేళ్ల తర్వాత జరిగిన 1991 సాధారణ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీకి దిగి కాంగ్రెస్‌కు చెందిన ఉమా గజపతిరాజుపై విజయం సాధించి ఎంపీ అయ్యారు.  ఆ తరువాత మళ్లీ 1996, 1998లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా మళ్లీ తిరిగి 1999 ఎన్నికల్లో మరోసారి విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

అనంతరం 2004 ఎన్నికల్లో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై పోటీకి దిగి ఓటమి చవిచూశారు. మళ్లీ 2009 ఎన్నికల్లో ఎంవీవీఎస్ మూర్తి పోటీచేసినా.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లోనే సినీనటుడు మెగాస్ఠార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపింది. దీంతో అక్కడ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి పురంధేశ్వరి విజయం సాధించారు.

ఇక, 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో ఆ ఎన్నికల్లో ఎంవీవీఎస్ మూర్తి పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే ఆయన సేవలను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు.

విద్యావేత్తగా…

సౌమ్యుడు, వివాదరహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎంవీవీఎస్ మూర్తి.. రాజకీయనేతగానే కాకుండా విద్యావేత్తగా కూడా తనదైన ముద్రవేశారు. గాంధేయవాదాన్ని అనుసరించిన ఆయన మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ విద్యా సంస్థ అనంతరం ‘గీతం వర్సిటీ’గా మారింది.

అంతేకాదు, ఆ తరువాత ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వ సహకారంతో తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో.. ఇంటర్, డిగ్రీ కాలేజీలను కూడా ప్రారంభించారు. అనూహ్యంగా మూర్తి అమెరికాలో అకాల మరణం చెందడం అటు విద్యా రంగానికి, ఇటు రాజకీయ రంగానికీ తీరనిలోటుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

- Advertisement -