
అనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ తెలుగుదేశం పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా, రాయదుర్గం టికెట్‌ను మరోసారి మంత్రి కాలువ శ్రీనివాస్‌కు కేటాయించడంపై అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం.
వైసీపీలో చేరే అవకాశం..
అయితే, గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి కాలువ శ్రీనివాస్ రంగంలోకి దిగినా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, గోవింద రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, రాయదుర్గం టికెట్‌ను మంత్రి కాలువ శ్రీనివాస్‌కు కేటాయించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అంతేగాక, కాలువ శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తలు, అనుచరుల కోరిక మేరకు తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక, కాలువ శ్రీనివాస్‌పై పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా కాలువ శ్రీనివాస్‌కు పట్టులేదని ఆయన అన్నారు.








