
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో తెలుగుదేశం నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది.
నామినేషన్లన్నీ సక్రమంగానే ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైసీపీ తరఫున జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
ఒక్కొక్క నామినేషనే రావడంతో..
షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 5వ తేదీ వరకు గడువుంది. పోలింగ్ అనివార్యమైతే మార్చి 12న నిర్వహించాలనుకున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కొక్క నామినేషనే దాఖలు కావడం, పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి పేరిట రూ.1.86 కోట్ల చరాస్తులు, రూ.5.93 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఈ మేరకు నామినేషన్ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా, మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆర్థికమంత్రి యనమల 1951 మే 12న తూర్పు గోదావరి జిల్లా ఏవీ నగరంలో జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్ట్భద్రుడైన ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 1983 నుంచి 1999,2004 ఎన్నికల్లో ఆరుసార్లు తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.








