జనసేనలోకి జెడి లక్ష్మీనారాయణ! పోటీ అక్కడినుండేనా?

jd-lakshmi-narayana-
అమరావతి: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసిన అధికారి, కర్ణాటకలో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డి కేసును డీల్ చేసి దేశం మొత్తం తనదైన ముద్రవేసిన లక్ష్మీనారాయణ , పవర్ స్టార్  పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీలో చేరారు.
 
శనివారం అర్థ రాత్రి 1 గంటలకు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన లక్ష్మీనారాయణ, ఓ గంటపాటూ చర్చించారు. ఆదివారం ఉదయం 10.30కు జనసేనలో చేరిపోయారు. లక్ష్మీ నారాయణ వంటి నిజాయితీ గల నేత తమ పార్టీలో చేరడం ఎంతో గౌరవమని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. 
 
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుండి  కొన్ని లక్ష్మీ నారాయణ అధికార టీడీపీలో చేరతారని వార్తలొచ్చాయి. వాటిని లక్ష్మీ నారాయణ ఖండించారు. టీడీపీ ఆయనకు భీమిలి టికెట్ ఇవ్వాలనుకున్నా ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. త్వరలో జరగబోయే  ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం లేదా లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారు లక్ష్మీ నారాయణ.
 
రాష్ట్రంలో ఎన్నికలు అనగానే డబ్బే ప్రధానపాత్ర పోషిస్తోందన్న ఆయన, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేసే విధానం కాకుండా అసలు డబ్బే తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 
 
ఆ దిశగానే తన చర్యలు, పోరాటం ఉంటాయన్నట్లుగా సంకేతాలిచ్చారు లక్ష్మీనారాయణ. లక్ష్మీ నారాయణ పార్టీ పెడతారనీ, దాని పేరు ప్రతిధ్వని అనీ ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. వాస్తవంలో అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఉద్యోగం మానేశాక, అయన  కొన్నాళ్లు రైతుల తరపున పోరాడిన మాజీ జేడీ, ఏదైనా ఊరిని దత్తత తీసుకొని వ్యవసాయంలో విప్లవాలు సృష్టించాలని భావించారు.
 
ఆయన ఏదైనా స్వచ్చంధ సంస్థ పెడతారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆయన ఎక్కడి నుంచీ బరిలో దిగుతారన్నదానిపై చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే జనసేనతో ఓ అవగాహనా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
 
వైజాగ్ లేదా విజయవాడ నుంచీ ఎంపీ స్థానానికి బరిలో దింపుతారని సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేనలోకి చేరికలు ఎక్కువైపోతున్నాయి. చూడాలి మరి ఈ సారి ఎన్నికల్లో జనసేన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో..