22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షాక్ కొడుతోన్న కరెంటు బిల్లులు.. తీవ్ర అసహనంలో వినియోగదారులు

షాక్ కొడుతోన్న కరెంటు బిల్లులు.. తీవ్ర అసహనంలో వినియోగదారులు

electricity-bills-shock
- Advertisement -

అమరావతి/హైదరాబాద్: విద్యుత్తు బిల్లులు చూసి ప్రజలు షాక్ తింటున్నారు. అసలే కరోనాతో నానా అవస్థలు పడుతుంటే.. ఈ బిల్లుల గొడవేంటి మహాప్రభో.. అంటూ ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.

ఎంత వేసవి కాలం అయినా బిల్లులు రెండు, మూడు రెట్లు పెరుగుతాయా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో విద్యుత్తు మీటర్ల రీడింగులను మార్చిలో తీయలేదు. గత ఏడాది మార్చి నెలలో వినియోగదారులు ఎంత కరెంటు వాడారో అంతకు బిల్లులు జారీ చేశారు అధికారులు.

మళ్లీ ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లులు కూడా తీయలేదు. గత ఏడాది ఇదే నెలలో వినియోగదారుల వాడకాన్ని బట్టి అంతకు బిల్లులు జారీ చేసి పారేశారు. 

దీంతో ఆ బిల్లులు చూసి గుండె బాదుకోవడం వినియోగదారుల వంతు అయింది. లాక్‌డౌన్ అనంతరం మీటర్ల రీడింగ్ తీసి అదనంగా చెల్లించిన సొమ్మను సర్దుబాటు చేస్తామని అధికారులు అంటున్నారు.

ఇక ఏపీలో అయితే కరెంటు బిల్లులు వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రెండు నెలల రీడింగ్ ఒకేసారి తీయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు.

500 యూనిట్లు దాటడంతో టారిఫ్ మారిపోయి వేలల్లో బిల్లు వస్తోంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు శాఖ ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్‌ను నిలిపేసింది.

దీంతో మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్‌ వినియోగంతో కలిపి మేలో సంబంధిత అధికారులు బిల్లులు జారీ చేశారు. ఫలితంగా కేటగిరీ మారిపోయి బిల్లు పేలిపోయింది.

తిరుపతిలోని ఓ వినియోగదారుడికి మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి మే నెలలో రీడింగ్ తీస్తే 531 యూనిట్లు వచ్చింది. ఆ యూనిట్ల ప్రకారం టారిఫ్ మారి రూ.2,542 బిల్లు వచ్చింది.

అందులో ఫిబ్రవరిలో సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా చెల్లించిన రూ.450 మినహాయించి.. మిగతా బిల్లును సంబంధిత సిబ్బంది ఆ వినియోగదారుడి చేతిలో పెట్టారు. 

అనంతపురంలో కూడా ఓ వ్యక్తికి రూ.2,522 బిల్లు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రీడింగ్ తీస్తుండడంతో అది 500 యూనిట్లు దాటిపోతోంది.

దీనివల్ల టారిఫ్ మారిపోయి యూనిట్‌కు రూ.9.95 వసూలు చేస్తుండడంతో బిల్లులు వేలల్లో వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. 

ఇంతింత బిల్లులు ఎలా చెల్లిస్తాం? అంటూ వినియోగదారులేమో రుసరుసలాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం తప్పించాలని కోరుతున్నారు.

‘‘ఎక్కువేం వేయలా, అనుమానం ఉంటే చూసుకోండి..’’

విద్యుత్తు బిల్లులు భారీగా వస్తున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడంపై ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ స్పందించారు.

ఎలక్ట్రిసిటీ టారిఫ్, బిల్లింగ్ సిస్టంను అర్థం చేసుకోవడంలోనే సమస్య ఎదురవుతోందని చెబుతూ.. విద్యుత్తు బిల్లులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని ఆయన తెలిపారు.

అనుమానం ఉన్న వినియోగదారులు ఆ వివరాలను చూసుకోవాలని, అప్పటికీ అనుమానం తీరకపోతే 1912 నంబర్‌కు ఫోన్ చేసి సందేహ నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు జూన్ 30 వరకు అవకాశం ఉందని, ఆ గడువు వరకు ఎలాంటి అపరాధ రుసుం వసూలు చేయరని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

 

- Advertisement -