24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజీత్.. ఈసీ ఆదేశాలు జారీ

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజీత్.. ఈసీ ఆదేశాలు జారీ

ec-appoints-vishwajeet-as-ap-intellegence-dg
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈయన 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. రెండు నెలల కిందటే అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన కుమార్ విశ్వజీత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వారిపై బదిలీ వేటు వేసింది. కుమార్ విశ్వజీత్‌ను ఏపీ కొత్త కొత్త ఇంటెలిజెన్స్ డీజీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ నేతల ఫిర్యాదుతో…

అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేయడంతో వారిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో.. ఏపీ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్ ఎంపికపై చీఫ్ సెక్రెటరీ అనిల్‌ చంద్ర పునేఠా ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. వీరిలో కుమార్‌ విశ్వజీత్‌ (పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌), నళిన్ ప్రభాత్‌ (ఏడీజీ ఆపరేషన్స్‌), కృపానంద త్రిపాఠి ఉజాలా (హోంగార్డుల విభాగం ఏడీజీ) ఉన్నారు.

వీరి పేర్లను పరిశీలించిన ఎన్నికల సంఘం చివరికి కుమార్ విశ్వజీత్‌ను డీజీగా ఎంపిక చేస్తూ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ కీలకం కావడంతో.. ఎన్నికల సంఘం చివరకు విశ్వజీత్‌నే ఎంచుకుంది.

- Advertisement -