సోమవారమే రంజాన్.. ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు…

- Advertisement -

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దేశంలో రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం జరుపుకోనున్నారు. 

ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ షా బుఖారీ, హైదరాబాద్‌లోని రూహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ ఈ మేరకు ప్రకటించారు.

శనివారం ఢిల్లీతోపాటు దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని, ఆదివారం రాత్రి రంజాన్ మాసం పూర్తి కావడంతో నెలవంక కనిపించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

కాబట్టి దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగ జరుపుకోవాలని, అయితే దేశంలో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఈద్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని వారు సూచించారు.

కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు…

తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మత సామరస్యానికి రంజాన్ నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలంటూ ఆయన ఆకాంక్షించారు.

అయితే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలోనే ప్రార్థనలు పూర్తి చేసుకుని ఆనందోత్సాహాలు పంచుకోవాలని కేసీఆర్ కోరారు. 

అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యం, సహృద్భావం, దాతృత్వాలకు ప్రతీక రంజాన్ పండుగ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలను ఆదుకోవడం వంటివి రంజాన్ పండుగ సందర్భంగా మనకు కనిపిస్తాయన్నారు.

కరోనా నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. 

 

 

- Advertisement -