
ప్రకాశం: జిల్లాలోని పర్చూరు శాసనసభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఆయన కుమారుడు హితేష్ చెంచురాంను పోటీలో దించాలని ప్రయత్నాలు జరిపినప్పటికీ..అది సాధ్యం కాలేదు.
హితేష్ పౌరసత్వమే కారణమా..?
ఎందుకంటే.. హితేష్‌కు అమెరికా పౌరసత్వం ఇంకా రద్దవకపోవడమే కారణం. ఆయనకు భారత పౌరసత్వం వస్తేనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికలకు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చురు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీ కూడా ఇందుకు సుముఖంగా ఉండటంతో ఆయనే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై అధికారిక ప్రకటన చేయడమే ఆలస్యం. ఫిబ్రవరి నెలలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తోపాటు దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పుడు తాను కూడా వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించని దగ్గుబాటి.. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.








