
ఏలూరు: రాష్ట్రంలో అరాచకాలకు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు శాశ్వతంగా తెరదించుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు ముగింపు పలకడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ప్రజల వద్దకే వచ్చి పట్టాలు అందిస్తున్నామని తెలిపిన సీఎం, ఇప్పటివరకు 7,450 గ్రామాల్లోని 32 లక్షల మందికి పైగా రైతులకు బ్లాక్‌చైన్ సాంకేతికతతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.
గతంలో 22-ఏ జాబితాలో పెట్టి వేధించిన 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించి, 25 వేల మంది రైతులకు న్యాయం చేశామన్నారు. “మీ భూమిపై మీకే పూర్తి హక్కు ఉండాలి, ఇతరుల పెత్తనం లేదా ఫోటోలకు తావులేదు” అని స్పష్టం చేశారు.
నక్సలిజం, ఫ్యాక్షనిజాన్ని అణచివేసిన చరిత్ర తనదని గుర్తుచేస్తూ… బాబాయ్ హత్యను తనపై తోసేందుకు యత్నించిన “గొడ్డలి పార్టీ” అరాచకాలను ఉపేక్షించేది లేదన్నారు.
మహిళా పోలీస్ అధికారిపై దాడికి తెగబడటం, గంజాయి-బ్లేడ్ బ్యాచ్‌లను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండించారు. మెగా డీఎస్సీ అభ్యర్థులపై బురదజల్లే యత్నాలను తప్పుపట్టారు.
ఇక ఆక్వా రైతులకు రూ.1.50లకే విద్యుత్ అందిస్తామని, కైకలూరు తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, పాలనలో జవాబుదారీతనం కోసం ఐవీఆర్ఎస్ సమీక్షలు కొనసాగుతాయని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.








