28.8 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠకు తెర: పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఈ రెండు స్థానాల నుంచే..

ఉత్కంఠకు తెర: పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఈ రెండు స్థానాల నుంచే..

- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన ఈసారి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

ఎనిమిది స్థానాల్లో సర్వే చేయించి…

పవన్ కళ్యాణ్ నామినేషన్ ఎప్పుడు దాఖలు చేసేదీ మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ప్రకటిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎనిమిది స్థానాలు(అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం) పరిశీలించిన తర్వాత అంతర్గత సర్వే నిర్వహించి గాజువాక, భీమవరం స్థానాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.

పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా, రెండోస్థానంపైనే ఉత్కంఠ నెలకొంది. మంగళవారం జనసేన పార్టీ ప్రకటనతో ఆ ఉత్కంఠకు తెరపడింది. కాగా, పశ్చిమగోదావరి సొంత జిల్లా కావడం, భీమవరం సామాజికపరంగా కలిసి వచ్చే అంశం కావడంతో ఈ స్థానానికి పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కాగా, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయన కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయడం గమనార్హం. 2009 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేశారు. పాలకొల్లులో ఓటమి చవిచూడగా, తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందారు.

 

- Advertisement -