అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టివి చానల్ గురించిన వార్తలు మరోసారి తెరమీదకు వచ్చాయి. కొత్తగా చానల్ పెట్టడం కాకుండా.. ఇప్పటికే ఉన్న నడుస్తోన్న చానల్‌ను టేకోవర్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కమ్యూనిస్టు పార్టీలు నడిపిస్తున్న రెండు ఛానెళ్లలో ఏదో ఒక దానిని టేకోవర్ చేయాలని ఆల్రెడీ జనసేనాని డిసైడ్ చేసేశారని టాక్.
కొత్తగా ఛానెల్ పెట్టేకంటే…
తొలుత కొత్త ఛానెల్ పెట్టాలని భావించినా.. దానికి మరింత సమయం పడుతుందని తేలడం, పైగా సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కొత్త చానల్ నిర్ణయం మార్చుకున్నారట. మరోవైపు కాపు సామాజిక వర్గానికే చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త సొంతగా టివి చానల్ పెట్టాలనుకుని అందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ తెప్పించినా ఆ చానల్‌ను లైవ్‌లోకి తీసుకురాలేకపోయారని సమాచారం.
దీంతో సదరు ఛానెల్‌ను తాము నడిపిద్దామని పవన్ చూసినప్పటికీ ఎందుకో అదీ వర్కవుట్ కాలేదట. దీంతో ఫైనల్‌గా ఆల్రెడీ నడుస్తున్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ టివి చానల్‌ను టేకోవర్ చేయాలని డిసైడ్ అయిపోయారట. ఇక ఈ విషయంలో ఇతరత్రా ఆలోచనలు ఏమీ లేవని, ఆ కమ్యూనిస్ట్ పార్టీ చానల్‌ను జనసేనకు అండగా నడపాలని పవన్ కళ్యాణ్ ఫిక్సయ్యారనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టాక్!
ఎర్ర చానల్… టేకోవర్?
రాష్ట్రంలో రెండు ప్రధాన వామపక్ష పార్టీలకు ఎప్పట్నుంచో రెండు న్యూస్ పేపర్లు ఉండగా, ఆ తరువాత మారిన కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒకటి ఉండాలనే భావనతో ఆ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు టివి చానళ్లు స్థాపించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటైన 10 టివి కాకుండా మరో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చానల్‌ను ఇప్పుడు జనసేన తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
త్వరలోనే.. ‘జె’ టివి!
నిర్వహణా భారం భరించే విషయంలో ఇప్పటికే పలు చేతులు మారిన ఈ టివి చానల్ తమ అంకెల పేరు మార్చుకొని ‘జె’ అనే ఇంగ్లీష్ అక్షరంతో జన సేన రాగం ఆలపించబోతోందని అంటున్నారు. ఈ చానల్‌ను తాము తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై తర్జనభర్జన పడిన జనసేన ముఖ్యలు ఆ టివి చానల్‌ను నడిపే విషయమై ఇప్పటికే లెక్కలు కూడా వేశారట. పవన్ తరుపున ఈ చానల్ నిర్వహణ బాధ్యతలు తాను చూస్తానని విజయవాడకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇప్పటికే భరోసా ఇచ్చారని చెబుతున్నారు.
సిబ్బందిని కొనసాగిస్తారా? లేక…
ఒకవేళ జనసేన గనుక ఆ కమ్యూనిస్ట్ పార్టీ చానల్‌ను తన అధీనంలోకి తీసుకుంటే అందులో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగిస్తుందా? లేకపోతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారా? అనే విషయంపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ మార్చినా పాత్రికేయ బృందాన్నే మార్చుతారని, టెక్నికల్ సిబ్బందిలో చాలామటుకు పాతవారినే కొనసాగిస్తారని అంటున్నారు.
ఆనందంలో పార్టీ శ్రేణులు…
జనసేన పార్టీకి కూడా సొంత చానల్ ఏర్పాటు కాబోతోందనే విషయం తెలిసి ఇటు పవన్ కల్యాణ్ అభిమానులు, అటు పార్టీ శ్రేణులు ఆనందంలో ఓలలాడుతున్నట్లు తెలుస్తోంది. తమ పవర్ స్టార్‌కు ఇప్పుడు మీడియా అండ కూడా చాలా అవసరమని, పార్టీకి సొంత చానల్ ఉండడం బాగా కలిసొస్తుందని, పవన్ మీడియా రంగంలోనూ అద్భుత విజయాలు సాధిస్తారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఏ రాజకీయ పార్టీ కైనా తమదైన వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కనీసం ఒక టివి చానల్ అండ చాలా అవసరమని, లేకుంటే ఇబ్బందేనని జనసేన శ్రేణులు భావిస్తున్నాయట. ఈ క్రమంలో ‘జె’ చానల్ రాక కన్ఫర్మ్ అంటూ వార్తలు రావడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.