
అమరావతి: ఏపీలో పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగ అభ్యర్థులకు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వచ్చే నెల అంటే.. మేలో 5వ తేదీన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. అయితే అదే రోజున ఎల్ఐసీ ఏఏఓ పరీక్ష కూడా జరగనుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక నిరుద్యోగులు తలపట్టుకుంటున్నారు.
ఏపీలో గ్రూప్-2 పరీక్షకు ఇప్పటికే 3 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఎల్ఐసీ ఏఏఓ పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెండు పరీక్షల తేదీలు ఒకేరోజున రావడంతో నిరుద్యోగ అభ్యర్థులు కంగుతిన్నారు. ఏ పరీక్షకు హాజరుకావాలో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు.
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని పలుమార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) అధికారులు పట్టించుకోలేదని కొందరు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షలను వాయిదా వేసేవారని వారు గుర్తు చేశారు.
ఇప్పుడు రెండు పరీక్షలు ఒకే రోజున వచ్చినాకానీ ఏపీపీఎస్సీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.








