విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్‌కు జరపండి: యూజీసీకి కమిటీ నివేదిక సిఫార్సు…

university-grants-commission
- Advertisement -

న్యూఢిల్లీ: ఏటా జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరాన్ని ఈ ఏడాది మాత్రం సెప్టెంబర్‌ నెలలో ప్రారంభించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి హర్యానా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్‌సీ కుహాడ్ నేతృత్యంలోని కమిటీ సూచించింది.

కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యా సంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్ విద్యాబోధనకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు యూజీసీ ఇటీవల రెండు కమిటీలను నియమించింది. 

రెండు కమిటీలు ఏం చెప్పాయంటే…

వీటిలో మొదటి కమిటీకి హర్యానా విశ్వవిద్యాలయం వీసీ ఆర్‌సీ కుహాడ్ నేతృత్వం వహిస్తుండగా, రెండో కమిటీకి ఇగ్నో వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు నేతృత్వం వహిస్తున్నారు. ఈ రెండు కమిటీలు శుక్రవారం తమ నివేదికలను విడివిడిగా సమర్పించాయి. 

మొదటి కమిటీ విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ నెలకు జరపాలని సిఫార్సు చేయగా, రెండో కమిటీ సరైన వసతులు ఉంటే యూనివర్సిటీలు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని, లేనిపక్షంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాతనే నిర్వహించుకోవాలని సిఫార్సు చేసింది. 

ఈ రెండు కమిటీల నివేదికలను ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వచ్చే జూన్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు.

అయితే దేశంలో కరోనా వ్యాప్తిని కూడా దృష్టిలో ఉంచుకునే సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కొన్ని రోజులు ఆగి పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని హెచ్ఆర్‌డీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -