
బెంగుళూర్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్. 2018లో వచ్చిన చిత్రాలలో భారీ విజయం సాధించిన ఈ కన్నడ చిత్రం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి అమితాదరణ లభించింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం తెరకెక్కుతుండగా ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ బెంగళూరులో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మైసూర్‌లో ఓ షెడ్యూల్ జరపనున్నట్టు సమాచారం. జూన్ రెండో వారంలో చిత్ర యూనిట్ రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ జరపనుంది.
సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసిఈ ఏడాదే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్ కనిపించనున్నారట. బాలీవుడ్ నటి రవీనా టాండన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఇందులో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై క్లారిటీ రావలసి ఉంది.








