బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమ(శాండల్ వుడ్)కు చెందిన ప్రముఖ నటుడు, విలన్, పోలీసు పాత్రల్లో నటిస్తున్న ధర్మేంద్ర అలియాస్ ధర్మా.. తనను షూటింగ్ ఉందంటూ పిలిచి, జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన తనను అశ్లీలంగా చిత్రించి ఆపైన డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ధర్మాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే పరిశ్రమకు చెందిన ఓ నటి(35) పోలీసులకు ఫిర్యాదు చేయడం శాండల్ వుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అశ్లీల వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పటివరకు విడతల వారీగా తన దగ్గర రూ. 14 లక్షలు తీసుకున్న నటుడు ధర్మా మళ్లీ డబ్బు కోసం వేధిస్తున్నాడని, ఇవ్వకపోతే తనకు సంబంధించిన అశ్లీల వీడియోను తన పేరెంట్స్‌కు పంపుతానని, ఆన్‌లైన్‌లో పెడతానంటూ వేధిస్తున్నాడని ఆ నటి ఆరోపిస్తోంది. పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ధర్మ అలియాస్ ధర్మేంద్ర పేరున్న నటుడు. విలన్ పాత్రలు చేస్తుంటాడు. డ్యాన్స్ కొరియో గ్రాఫర్‌గానూ పని చేశాడు. సుదీప్ సినిమా ‘హుచ్చా’తో తెరంగేట్రం చేశాక.. విలన్‌గా బిజీ అయిపోయాడు.
షూటింగ్‌కు రావాలంటూ పిలిచి…
1 మార్చి 2017న నటుడు ధర్మా ఫోన్ చేసి ఆర్ ఆర్ నగర్‌లో షూటింగ్ ఉందని, రావాలని నటిని పిలిచాడు. ఆమెను షూటింగ్ స్పాట్‌కు తీసుకొచ్చేందుకు తన కారు డ్రైవర్ నవీన్‌ను ఆమె ఇంటికి పంపించాడు. దీంతో ఆ నటి ఆర్ఆర్ నగర్‌లోని సెట్‌కు వెళ్లగా, అప్పటికే షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పిన ధర్మా హోటల్లో భోజనం చేద్దామంటూ ఆ నటిని తనతో తీసుకెళ్లాడు.
జ్యూస్‌లో మత్తుమందు కలిపి…
అక్కడ ఆమెకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అశ్లీలంగా వీడియో చిత్రించి ఆపైన బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియో బయటపెడతామని బెదిరించడంతో పాపం ఆ నటి గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మే నెల వరకు రూ.14 లక్షలు అందజేసింది. అయినా కూడా ధర్మా, అతడి కారు డ్రైవర్ నవీన్ వేధింపులు ఆపలేదు. ఆ అశ్లీల వీడియోను ఆ నటి కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తూ.. మరింత డబ్బు ఇవ్వాలని నటుడు ధర్మా, అతని కారు డ్రైవర్ నవీన్ బెదిరించసాగారు.
27 మే 2018న రాత్రి వారు ఇంటికొచ్చి మరీ వేధించడంతో ఆ నటి జరిగిన విషయం మొత్తం తన భర్తకు చెప్పేసింది. ఆ తరువాత భర్త సహకారంతో ఈ ఏడాది జూన్ 6వ తేదీన నటుడు ధర్మా, అతడి కారు డ్రైవర్ నవీన్ మీద బేగూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ నటుడు ధర్మా, నవీన్‌లను అరెస్టు చెయ్యలేదని బాధిత నటి ఆరోపిస్తోంది.
అదేమని అడిగితే, వారు తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారని, వారిని అరెస్టు చెయ్యకుండా పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. రెండు నెలల క్రితమే బాధితురాలు ఫిర్యాదు చేసినా పేరున్న నటుడు కావడంతో.. పోలీసులు లైట్ తీసుకున్నారు. విషయం మీడియాకు తెలియడంతో ఇటీవలే ఎట్టకేలకు నటుడు ధర్మా, అతడి కారు డ్రైవర్ నవీన్‌లపై కేసు నమోదు చేశారు.