ఇది జరిగిన కథ అని అందరూ అంటారు..
ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో తాము సాగించే ప్రయాణంలో.. ఎక్కడో ఒక దగ్గర ప్రేమ అనే స్టేజ్ దగ్గర ఆగకుండా ఉండలేరు..
అందుకే దీనిని ఒక ప్రేమ కథగానే చెప్పాలి..
అయితే చాలామంది ఈ రహస్యాలను తమతో పాటే సమాధి చేసేసుకుంటారు. కొందరు గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకుంటారు..
కానీ ఒక సందర్భంలో.. నా భార్య దగ్గరే.. నా ప్రేమకథను చెప్పాల్సి రావడం.. గొప్ప ట్విస్టుగా పేర్కొనాలి.
ఇంతకీ ఈ కథ విన్నాక.. నాభార్య నన్నేమంది? అనేకదా.. మీ సందేహం?.. కథ చదివాక.. మరి మీరేమంటారు?
రండి.. మా ఇద్దరి కథను మీరూ చదవండి….
…………………………………………………………
వర్షం కురిసిన వేళ…
మా పెళ్లయ్యి ఇప్పటికి ఇరవై రెండేళ్లయ్యింది. నా భార్య పేరు సుశీల..
నా వయసిప్పుడు 44 ఏళ్లు.. నా భార్య వయసు 38… మా అబ్బాయిది..19…
ఒక్కడే వారసుడు.. వాడు ఇంజనీరింగ్ చదవనని అన్నాడు.. మేం కాదు కూడదని.. వాడి తలవంచి.. సొసైటీలో అందరిముందు ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం..రూ.5 లక్షలు డొనేషన్ కట్టి మరీ ఎన్ఆర్ఐ కోటాలో సీటు సంపాదించాం.. మొదటి సంవత్సరం.. మొదటి సెమిస్టర్‌లో.. మావాడికి ఒక సబ్జక్టులో సున్నా మార్కులు వచ్చాయి.. కాలేజీ నుంచి ఫోను వచ్చింది. తీసుకెళ్లిపొమ్మని… అలా మొత్తానికి వాడి పంతమే నెగ్గింది. ఇంజనీరింగ్ మాన్పించి తీసుకొచ్చేశాం. దాంతో వాడికి నచ్చిన కోర్సు అని చెప్పి.. మాకు నోరు తెలియని ఒక పేరు చెప్పి చైన్నై వెళ్లిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మా భార్యాభర్తలిద్దరమే లంకంత కొంపలో ఉంటున్నాం..
నిజానికి వాడుంటే ఎంతో టైం పాస్ అయ్యేది.. వాళ్లమ్మ కొట్టిందని వాడు చెప్పడం.. లేదా..వాడేదో అల్లరి పని చేశాడని సుశీల కంప్లయింట్ చేయడం, కొత్త సినిమా రిలీజైన రోజున అప్పుడప్పుడు జేబులో డబ్బులు కనిపించకుండా పోవడం.. బైక్ కి వారంలో ఏదొక పార్ట్ ఊడిపోవడం, అలా ఏదొకటి జరుగుతూ ఉండేవి. ఇప్పుడవేవీ లేవు.. నా భార్య ఎవరిపై చెబుతుంది. ఆఫీసు నుంచి వచ్చాక.. వాడొచ్చాడా? అని కొన్నేళ్లుగా అడగడం రివాజు..నేను మౌనంగా మారిపోయాను. మా ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమే..వాడి చదువుకోసం, వాడి ఉన్నతి కోసం..పగలు, రాత్రి ఆలోచించడం, ప్రణాళికలు వేసుకోవడం..ఇంకా ఇంకా కష్టపడి పనిచేయడం.. ఇప్పుడవేవీ లేవు.. అంతా నిశ్శబ్ధం… ఏదో వెలితి.. ఏదో ఉంటున్నాం..తింటున్నాం..అంతే…వాడక్కడ సరిగ్గా తింటున్నాడా లేదా.. అన్న ఆలోచనే నిరంతరం…
ప్రస్తుతం మా ఇద్దరికి బోర్ గా ఉంది.. ఆరోజు బయట వర్షం సన్నగా పడుతోంది. అప్పుడే సాయంత్రమవుతోంది. చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. నేను కిటికీలోంచి అలా బయటకు చూస్తున్నాను. వర్షం వస్తున్నప్పుడు రోడ్డుపైకి చూడటం నాకెంతో ఇష్టం.. ట్రైన్, బస్సు, విమానాల్లో వెళ్లేటప్పుడు వర్షం వస్తే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అదో ఆనందం..ఈ సమయంలో ఏవో అస్పష్టమైన ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..’మా టీవీ’ సీరియళ్లు చూడకుండా ఏదో ఆలోచించడం సుశీల గమనించింది. ‘ ఏమిటీయన.. ఆ సీరియల్ అస్సలు మిస్సవ్వడు..ఇలా దీర్ఘాలోచనలో పడ్డాడేమిటి? అనుకొని.. ‘ఏమిటి సంగతి’ చెప్పమని మంకు పట్టు పట్టింది.నా మనసులో ఏదో దాస్తున్నాను..అనే విషయాన్ని ఇట్టే గ్రహించేసింది..
22 ఏళ్ల సహవాస దోష ఫలితమని అనుకున్నా…
ఏమీలేదు లేవే..అని చివరి మాటగా అన్నా.. చెప్పాల్సిందే అంది.. నిజానికి తనకేమీ ఊసు పట్టడం లేదు.. వాడుంటే తల్లీ కొడుకులిద్దరూ ఆ వసారాలో వంట చేస్తూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేవారు.. లేదా వాడికి నచ్చినవి చేయడంలో ఆత్మసంతృప్తి ఉండేది.. ఇప్పుడవేవీ లేవు..
‘సరే..నీవు నన్ను వదిలి వెళ్లనంటే చెబుతా..’ అన్నాను..
‘ఈ వయసులో నేనెక్కడికి వెళతాను.. మీ పిచ్చిగానీ’ అంటూ.. ఆవిడకేదో డౌటు వచ్చింది.. ఇదేదో ఇంట్రస్టింగ్ కేస్ లా ఉందని అర్థమైపోయింది. ఒక్క నిమిషం ఉండండి.. ఈ వర్షంలో మీకు పకోడీలు, టీ అంటే ఇష్టం కదా.. ఐదు నిమిషాల్లో తీసుకువస్తాను..అంటూ కిచెన్ లోకి పరుగులాంటి నడకతో వెళ్లింది. ఒక పావుగంటలో అన్నీ తెచ్చి.. ఇవిగో వేడివేడి పకోడీలు.. అదిగో బయట చల్లచల్లని వాతావరణం.. ఈ సమయంలో మీరేం వెచ్చవెచ్చని కథ చెబుతారో..చూద్దాం.. అంది నవ్వుతూ…
ఎలా మొదలు పెట్టాలో తెలీలేదు. కథ చెబుతానని కమిట్ అయ్యా.. ఆ కుర్ర వెధవ ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా.. అనుకుంటూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఉండిపోయాను. నేను దీర్ఘాలోచనలో ఉండటం చూసి.. ‘ఏమండీ లవ్ స్టోరియా?’ అంది..
ఎప్పుడూ కాకి ముక్కుకి దొండ పండులా..మీకు నేను దొరికాను..మీ ముఖానికి నేనే ఎక్కువ..అని ఏడిపించే సుశీలకి.. నన్ను ప్రేమించేవాళ్లున్నారని చెప్పడం థ్రిల్లింగ్ లా అనిపించింది.
నీవెలా కనిపెట్టావు..అన్నా.. చూస్తుంటే.. మీ ఫీలింగ్స్ తెలియడం లేదూ..అంది.. చిరునవ్వుతో..
అంటే చెప్పాక మళ్లీ ..మా ఇంటికెళ్లిపోతానని అనకూడదన్నా..
ఇక చెప్పవయ్యా స్వామీ.. అంది విసుగ్గా…
అంతా చెప్పాక.. నాకూ ఒక స్టోరీ ఉందని తిరిగి నీవూ చెప్పవుగా… డౌట్..డౌట్ గా అన్నా..
అందుకే ఎక్కువగా ఆ దిక్కుమాలిన టీవీ సీరియళ్లు చూడొద్దని చెప్పేది..అని సీరియస్సయ్యింది.
మళ్లీ ఎందుకైనా మంచిదని..మౌనంగా ఊరుకున్నా.. ఇక సుశీలకి నషాళానికి అంటుకుపోయింది.
చెబితే చెప్పవయ్యా..పోతే.. పో..అనేసింది.. వర్షం కూడా తగ్గిపోతోంది.. మీదేమైనా.. లైలా-మజ్నూ, దేవదాసు-పార్వతీ అంత గొప్పదా..అంటూ విసురుగా లేచింది.. నేను కంగారుగా.. ఆగాగు.. అన్నా.. దాంతో ఆమె.. ఏమిటి..ఓ బోడి బిల్డప్పు.. ఇప్పుడేదో ఆ దేవత దిగివచ్చినట్లుగానే చెబుతున్నావే..
ఒక్కసారి మళ్లీ ఆ వర్షం వైపు..కిటికీ వైపు చూశాను…
కథ మొదలైంది..
తూర్పుగోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు మాది..
రోడ్డుపైన పేద్ద డాబా ఇల్లు.. ఆ పైన ఒకటే గది.. అది నాది..
అక్కడ ఒక కిటికీ ఉంటుంది.. నేను పడుకునే మంచం, చదువుకునే టేబుల్..అన్నీ అక్కడే ఉంటాయి..
ఎప్పుడు వర్షం వచ్చినా.. ఆ గదిలోని కిటికీలోంచి చూడటం నాకలవాటు..
ఆరోజు సాయంత్రం…
అప్పుడే చీకటి పడుతోంది..
ఒకవైపు వర్షం పెద్దదవుతోంది.. అప్పుడే ఒక మెరుపు మెరిసినట్లనిపించింది..
ఆ వెలుగులో తళుక్కుమంటూ మెరిసింది.. ఓ అమ్మాయి.. తను మా ఇంటిలోకే పరిగెడుతోంది.. గబగబా మెట్లు దిగాను. ఆ అమ్మాయి పూర్తిగా తడిసిపోయింది. వాళ్లు ఊరికి కొత్త.. తహసీల్దార్ గారమ్మాయి.. పేరు సౌమ్య… పేరుకి తగినట్లుగానే సౌమ్యంగా ఉంది. తనూ నాలాగే ి ఇంటర్మీడియట్.. అమ్మ చెబుతోంది. అలా మొత్తానికి అలవాటయ్యింది. అయితే తను లేట్ అడ్మిషనేమో.. నోట్స్ ల కోసం వచ్చేది.. నా రైటింగ్ బాగుండటంతో సైన్స్ రికార్డులన్నీ నాతోనే రాయించేది..
ఆ సమయంలో తన జడలో మల్లెల సువాసన నాకు తగిలి..మైమరచిపోయేవాడిని..మంత్ర ముగ్థుడిలా తన వైపు చూసేవాడిని..తను జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవిలా.. ఇంద్రలోకం నుంచి నాకోసమే దిగి వచ్చిందేమో అనిపించేది.. ఒకొక్కసారి నేను రికార్డు ఏమైనా తప్పు రాసేస్తుంటే.. గబుక్కున చేయి పట్టుకొని ఆపేది.. అప్పుడా సున్నితమైన చేయి నన్ను తాకేసరికి.. నరాలు ఒక్కసారి ఝుమ్మనేవి..తొలి వయసులో అనుభవాలు..మధురానుభూతులనే మిగులుస్తాయి. ఒకొక్కసారి తను చాలా దగ్గరకు వచ్చేసేది.. ఆ ఊపిరి..నాకత్యంత దగ్గరగా తగిలేది.. గుండె వేయిమైళ్ల వేగంతో పరిగెట్టేది.. అంటూ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకు వచ్చి చూశాను.. తలపట్టుకొని కూర్చుంది సుశీల..
ఇదీ ఒక ప్రేమ కథా.. ప్రేమించుకుందాం రా.. సినిమాలో ఉన్నట్టు ఫైటింగులు, ట్విస్టులు ఉంటే ఏమైనా చెప్పండి..అంది…
నేను అలాంటిేవేవీ లేవని చెబుతూ.. కిటికీలోంచి చూస్తుంటే ఒక 42 ఏళ్ల వయసుంటుంది. ముగ్థమనోహరంగా ఉంది. ఇప్పటికీ ఎక్కడా బిగి తగ్గని శరీరంతో.. పాలరాతి బొమ్మలా కనిపించింది..తనిలాగే మా ఇంటిలోపలికే హడావుడిగా పరుగులు పెడుతూ వస్తోంది. వచ్చేసింది..
మా ఆవిడ కంగారుగా ఆమెను చూసి.. వర్షంలో ఆమె అవస్థను గమనించి లోనికి రమ్మనమని ఆహ్వానించింది. తనని చూస్తుంటే .. ఈ ముఖమెక్కడో చూసినట్టుందే అనిపిస్తోంది. తను నావైపు చూసి నవ్వుతోంది. తను కనిపెట్టేసింది. నాకే ఇంకా గుర్తు రావడం లేదు.. మా ఆవిడ టవల్ ఇచ్చింది..తుడుసుకోమని..తనేదో అడుగుతోంది.. నేనిక్కడే తహసిల్దార్ గా పనిచేస్తున్నా.. మధ్యలో కారు ఆగిపోయింది. సరే..మీ ఇంటి అరుగుపై ఉందామనుకున్నా..మీరు లోనికి పిలిచారు..అంటోంది..
తను తహసీల్దార్ అనగానే నాకర్థమైపోయింది. ఇంక మా ఆవిడ.. తహసీల్దార్ పేరు విని మధ్యతరగతి ఆర్భాటం, కంగారు పడుతూ ఇంకా ఎక్కువ హడావుడి చేసేసింది. ఇంతకుముందు చేసిన పకోడీలు.. అవీ ఇచ్చి టీ పెట్టడానికి లోనికెళ్లింది..
తను.. టవల్ తో తుడుచుకుంటూ.. సరాసరి నా దగ్గరకు వచ్చింది. అప్పటికే తడిసిన చీరలో అందాలన్నీ శరీరంతో కలిసిపోయి.. తళతళా మెరిసిపోతున్నాయి..
‘శీనూ’ ఎలా ఉన్నావు.. ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా అడుగుతోంది..
టీ కప్పుతో వచ్చిన మా ఆవిడ .. మా ఇద్దరినీ అలాగే చూస్తోంది…
———————————————————————————————————————————–
.. సమాప్తం..