ఉగాది రోజున.. ఏ దేవుడికి పూజ చేస్తారో తెలుసా?

mathsyavataram
- Advertisement -

అచ్చతెలుగు పండుగ.. ‘ఉగాది’. ఎక్కడెక్కడో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉండే వారు ఈ ఉగాది రోజున అందరూ ఒకచోట చేరి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది నుండే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ అయింది.

చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే.

శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాది నాడే. ఇలా ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఐతిహ్యాలు మన పురాణాల్లో కనిపిస్తాయి.

వసంత రుతువు ప్రారంభంతో…

ప్రకృతి పరంగా చూస్తే, మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమి తల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది.

ఉగాది రోజున దేవునికి సమర్పించాల్సిన నైవేద్యంలో ఉగాది పచ్చడితో పాటుగా వడపప్పు, పానకం ముఖ్యమైనవి. వడపప్పులో పెసరపప్పును వాడతారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి వేసవిలో అవస్థల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఉగాదితో వేసవి కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి వేసవిలో సూర్యుడు నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రత, వేడిని తట్టుకోడానికి పానకం లాంటి ద్రవపదార్థాల అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది.

త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. కేవలం కాలాన్ని ఆరాధించే పండుగ ఈ ఉగాది. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు.

హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక దైవరాధనతో జరుపుకోవడం మన ఆచారం. కానీ ఉగాది నాడు ప్రత్యేకంగా ఏ దైవాన్ని ఆరాధించరు. 

ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతన కనిపిస్తుంది. కాలః కాలయతా మహం అన్నాడు కృష్ణ భగవానుడు. ‘కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపాన్ని నేనే’ అంటాడు గీతాచార్యుడు. అందుకే ఉగాది రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది.

- Advertisement -