బైకో, కారో కాదు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే.. రాత్రికి రాత్రే మాయం చేసిన దొంగలు!

ts rtc bus,
- Advertisement -

తెలంగాణ:  బైకులు, కార్లు ఏం దొంగతనం చేస్తామనుకున్నారో ఏమోగానీ.. ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిపోయారా దొంగలు. హైదరాబాద్‌లోని సీబీఎస్ బస్ స్టాప్‌లో ఈ నెల 23వ తేదీ రాత్రి ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నిలిపాడు. మరుసటి రోజు ఉదయానికల్లా ఆ బస్సు అక్కడి నుంచి మాయమైంది. 

ఎవరు ఎత్తుకెళ్లారు?.. ఎక్కడికి తీసుకెళ్లారు? అన్నది అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 379 కింద వారు కేసు నమోదు చేశారు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ బస్సు తూప్రాన్ టోల్‌గేట్ దాటినట్టు సీసీటీవి ఫుటేజీ ద్వారా గుర్తించారు. 

కుషాయిగూడ డిపోకి చెందిన ఆ బస్సు నాందేడ్ వైపుగా వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. అది 2009 మోడల్‌ బస్సు అని.. నంబర్‌ను AP11Z6254 అని చెప్పారు.

కాగా, 2016లో కూడా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రెండు బస్సులు ఇలా చోరీకి గురయ్యాయి. తాజా ఘటనతో ఆ పీఎస్ పరిధిలో ఆర్టీసీ బస్సులకు భద్రత లేకుండా పోయిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -