
చెన్నై: నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన డీఎంకే (DMK) వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
విచారణ పూర్తయిన వెంటనే ఉదయనిధిని ఈ రోజే (మంగళవారం) స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని తమిళనాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ముందస్తు బెయిల్, అత్యవసర విచారణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టుకు కీలక సమాచారం అందించారు.
ఉదయనిధిని రిమాండ్‌కు తరలించే ఉద్దేశం తమకు లేదని, కేవలం విచారణ నిమిత్తమే తంజావూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విచారణ ముగిసిన వెంటనే ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
న్యాయవిచారణకు సహకరించాలి..
ప్రభుత్వ వాదనలను నమోదు చేసుకున్న మద్రాస్ హైకోర్టు.. ఉదయనిధి స్టాలిన్‌ను ఈరోజే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అదే సమయంలో పోలీసు విచారణకు ఉదయనిధి పూర్తిస్థాయిలో సహకరించాలని, అవసరమైనప్పుడు విచారణాధికారుల ముందుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
మంగళవారం ఉదయం చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఆయన నివాసం నుంచి తంజావూరు పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని విచారణకు తరలించిన సంగతి తెలిసిందే.
కావేరి జలాల నిరసన ప్రదర్శనలో సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, నటి త్రిష పేరుతో ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీవీకే మహిళా విభాగం ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.








