30.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మిడ్-ఎయిర్ డ్రామా.. గాల్లో 300 అడుగులు కిందకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం!

మిడ్-ఎయిర్ డ్రామా.. గాల్లో 300 అడుగులు కిందకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం!

- Advertisement -

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి 134 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులకు (Severe Turbulence) లోనైంది.

ఊహించని రీతిలో విమానం దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు క్యాబిన్ సిబ్బందితో కలిపి మొత్తం 12 మంది గాయపడ్డారు.

నిద్రలో ఉన్న వేళ.. విమానం కుదుపులు!
ఎయిర్‌బస్ A320 రకానికి చెందిన AI 2379 విమానం మంగళవారం ఉదయం ఫుకెట్ నుంచి బయలుదేరింది. ప్రయాణం మొదలైన గంటన్నర తర్వాత, చాలామంది ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

వాతావరణంలో మార్పుల కారణంగా విమానం తీవ్రంగా ఊగిపోతూ, ఒక పక్కకు ఒరిగింది. దీంతో సీటు బెల్టులు ధరించని కొందరు ప్రయాణికులు, సిబ్బంది విమానంలోని సీట్లపై నుంచి పైకి లేచి పడిపోయారు. ప్రయాణికుల తలలకు, భుజాలకు, నడుముకు గాయాలయ్యాయి.

ఢిల్లీలో సురక్షిత ల్యాండింగ్…
ఈ భయాందోళనల నడుమ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమానాశ్రయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌లు, అంబులెన్సులు గాయపడిన ప్రయాణికులకు తక్షణమే ప్రథమ చికిత్స అందించాయి.

కొందరిని వీల్‌చైర్లలో విమానాశ్రయంలోని మేదాంత వైద్య కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

ఎయిర్ ఇండియా స్పందన…
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ.. విమానం గాల్లో ఉన్నప్పుడు వాతావరణ సమస్యల వల్ల స్వల్ప కాలం పాటు ఎత్తులో మార్పు వచ్చిందని ధ్రువీకరించారు.

ప్రయాణికులకు తీవ్రమైన గాయాలేవీ కాలేదని, స్వల్పంగా గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ ఘటనపై సంబంధిత విమానయాన అధికారుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

చదవండి: 18 ఏళ్లకే యూనివర్సిటీ ప్రొఫెసర్.. 306 ఏళ్ల గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు!

- Advertisement -