26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అతి తీవ్ర తుపానుగా ‘ఫణి’.. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు!

అతి తీవ్ర తుపానుగా ‘ఫణి’.. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు!

- Advertisement -

విశాఖపట్టణం: ‘ఫణి’ తుపాను ముప్పు ఇంకా ఏపీకి తొలగిపోలేదు. నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో మొదలైన అల్పపీడనం ఆ తరువాత వాయుగుండంగా, తుపానుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ‘ఫణి’ అతి తీవ్ర తుపానుగా మారింది.

విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం విడుదల చేసిన తాజా వాతావరణ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చెన్నైకి తూర్పు అగ్నేయంగా 690 కిలోమీటర్లు, మ‌చిలీప‌ట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ‘ఫణి’.. మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారబోతోంది.

ఆగ్నేయ దిశ‌గా.. వేగంగా…

ప్రస్తుతం ఆగ్నేయ దిశ‌గా వేగంగా పయనిస్తోన్న ఈ తుపాను ఎక్కడ తీరం దాటుతుందనేది ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు తుపాను కారణంగా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది.

దీంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని, అలాగే ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ల‌రాదని సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

‘ఫణి’ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్త‌రాంధ్ర‌లో గంట‌కు 50 నుంచి 70 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ తుపాను గ‌మ‌నాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్‌) నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు సంబంధిత యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తోంది.

ఓడ రేవుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికలు…

అతి తీవ్ర తుపానుగా ‘ఫణి’ మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఓడరేవులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, గంగవరం రేవుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, మచిలీపట్నం, విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ప్రమాద ఘంటికలు మోగిస్తూ తీరంవైపు దూసుకొస్తోన్న ‘ఫణి’ బుధవారం పెను తుపానుగా మారనుంది. మే 4వ తేదీ వరకు ఈ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాలపై ‘ఫణి’ తుపాను ప్రభావం అధికంగా ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

మంగళ, బుధవారాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, గురువారం నుంచి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.

మే ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్‌ సైక్లోన్‌)గా బలపడనుంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. పెను తుపాను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అదే తీవ్రతతో కొనసాగనుంది. ఇప్పుడు అందరిలోనూ ఇదే తీవ్ర ఆందోళనను రేపుతోంది.

కేంద్రం నుంచి నిధులు విడుదల…

మరోవైపు ‘ఫణి’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ముందుగానే అవసరమైన నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.1086 కోట్లు విడుదలయ్యాయి.

తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్రం విడుదల చేసిన నిధులతో తుపాను బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

కోస్తా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశాం: చీఫ్ సెక్రెటరీ

ఏపీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘ఫణి’ తుపానును ఎదుర్కొనేందుకు ఇప్పటికే కోస్తా తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర ఏజెన్సీలను అప్రమత్తం చేశామని, తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కూడా తెలియబరుస్తున్నామని వివరించారు.

- Advertisement -