
అమరావతి: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికని తమకే కేటాయించాలని తెలుగుదేశం పార్టీ సీఎం జగన్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ పార్టీ కార్యకలాపాలకి ఈ ప్రజావేదికని ఉపయోగించుకుంటామని టీడీపీ తెలిపింది. అయితే టీడీపీ రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వంనుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ క్రమంలోనే ప్రజావేదిక తమకే కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేరిట సీఎస్‌కి ఓ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజావేదికని వైసీపీకి కేటాయించాలని తను లేఖ రాయలేదని, ఆ వార్తలన్నీ అవాస్తవమని రఘురామ్ వ్యాఖ్యానించారు.
ప్రజావేదికను వైసీపీకి కేటాయించాలని పార్టీ తరఫునగానీ, తానుగానీ ఎటువంటి లేఖలు ఇవ్వలేదని చెప్పారు. అన్నీ విషయాలు తెలుసుకుని మీడియా వార్తలు ఇస్తే బాగుంటుందని, ఒకవేళ ప్రజావేదిక విషయంలో లేఖ ఏమైనా రాస్తే చెబుతామని అన్నారు.








