
అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆ పార్టీ కేవలం ఒక స్థానంలోనే గెలిచింది. ఆఖరికి పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కూడా.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి నిశ్శబ్దంగా ఉన్న పవన్….రేపు రాజధాని అమరావతికి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్షించనున్నారు.
ఇక ఇందుకు సంబంధించి సమావేశానికి హాజరు కావాల్సిన నేతలకు, కార్యకర్తలకు ఇప్పటికే సమాచారం పంపారు. పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
కాగా, రేపు ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ పటమటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు.








