

అమరావతి: విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో కేంద్రం మసిపూసిన మారేడుకాయ చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం ఉదయం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు.
రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ ఆనందపడుతోందని.. చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన నరేంద్ర మోడీ మరో మోసమని.. బీజేపీ మోసాన్ని అందరూ ఖండించాలని నేతలకు సూచించారు.
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలి…
కార్గో రాబడి ఒడిశాకిచ్చి.. ప్యాసింజర్ రాబడి మనకిచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి 7వేల కోట్ల రూపాయల రాబడి పోగొట్టారని.. రిక్రూట్మెంట్లలో కూడా మనకన్నా ఒడిశాకే ఎక్కువని ఆరోపించారు.
రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా మన జోన్కు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా గురువారం సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాలని నేతలకు స్పష్టం చేశారు. శుక్రవారం నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలతో ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు కూడా విశాఖ జోన్ ప్రకటనపై పెదవి విరిచారు. రైల్వేజోన్ ప్రకటన కేవలం కంటితుడుపు చర్యే అని విమర్శించారు. ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను ఒడిశాకు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేంద్రం మోసపూరితంగా ప్రకటన చేసిందని ఆరోపించారు.
చదవండి: ఏపీకి గుడ్న్యూస్: విశాఖకు రైల్వే జోన్, ‘సౌత్ కోస్ట్ రైల్వే’








