

హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహాకూటమిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వాలను కూడా చేర్చుకున్నట్టు కనిపిస్తోందని మండిపడ్డారు.
రాజకీయాల కోసం జాతీయ భద్రతను, పుల్వామా దాడిని వాడుకోవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ఇలాంటి తప్పులకు పాల్పడితే ప్రజలు క్షమించరని అన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ జరిగినట్లే.. ఏపీలో కూడా..
గత నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పకుండా… ఇతర పార్టీలపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరించారని… ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతోందని జీవీఎల్ జోస్యం చెప్పారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులు కానీ వారి అకౌంట్లలోకి డబ్బులు వెళుతున్నాయని జీవీఎల్ ఆరోపించారు. కేంద్రం చేస్తున్న ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వేసుకుంటున్నారని.. చంద్రబాబు ఇప్పుడు స్టిక్కర్ బాబులా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని అన్నారు.
చదవండి: 2019 ఎన్నికల తర్వాత పెనుమార్పులు, పోటీపై త్వరలోనే: జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు








