22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బాబుతో భేటీ: అయినా అసంతృప్తే, పార్టీ మారడంపై తేల్చని ‘ఆమంచి’, ఏమన్నారంటే…

బాబుతో భేటీ: అయినా అసంతృప్తే, పార్టీ మారడంపై తేల్చని ‘ఆమంచి’, ఏమన్నారంటే…

chandrababu-failed-to-convince-mla-amanchi-krishna-mohan
- Advertisement -

babu

అమరావతి: పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం భేటీ అయ్యారు. అయితే, సీఎంతో భేటీ తర్వాత కూడా ఆయన టీడీపీలో కొనసాగుతానని స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. పార్టీలో ఉండాలా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని కృష్ణమోహన్ అన్నారు. తన అనుచరులతో భేటీ తర్వాతే ఏ విషయాన్నైనా ప్రకటిస్తానని తెలిపారు.

గురువారం ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో మొదట మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశమయ్యారు. తన నియోజకవర్గ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో నాకు, ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేశాయని ఆరోపించారు.

పార్టీలోని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి, పార్టీ పాకిస్తాన్‌లో ఉందా?: ఆమంచి

కులాల గురించి ఇప్పుడు మాట్లాడను.. కానీ, కొన్ని శక్తులు మాత్రం అడ్డంకులు కల్పించాయన్నారు. చీరాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లోకేష్ వస్తానంటే కొందరు వివాదాలు సృష్టించి ఆపేశారన్నారు కృష్ణమోహన్. లోకేష్ వస్తున్నారని ప్రకటనలు ఇచ్చాక కూడా రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

ఎందుకు రాలేదని అధిష్టానాన్ని అడిగితే సంతృప్తికర సమాధానం రాలేదని చెప్పారు. ఈ విధంగా లేని వివాదాలు సృష్టించే శక్తులు పార్టీలో ఉన్నాయని, తన నియోజకవర్గంలో కార్యక్రమాలను తనకు తెలియకుండానే రద్దు చేస్తున్నారని కృష్ణమోహన్ వాపోయారు.

అంతేగాక, పార్టీ ఇక్కడ ఉంటోందా..? పాకిస్తాన్‌లో ఉటోందా..? అంటూ ఆమంచి కృష్ణమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనకు ఎవరు ప్రత్యర్థులు లేరని, సమస్యలే తన ప్రత్యర్ధులు అన్నారు. పోతుల సునీత, దామచర్ల పేర్లు తానెక్కడా ఉచ్చరించలేదని చెప్పారు. చంద్రబాబు వద్ద కూడా తాను ఈ మాటలు చెప్పలేదన్నారు.

పార్టీ మారడంపై ఏటూ తేల్చని ఆమంచి…

అయితే, వైసీపీతో 10 రోజులుగా సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అని అంగీకరించారు కృష్ణమోహన్. తానిప్పటి వరకు జగన్‌‌ను కలవలేదని స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులతో రాజకీయ, కులపరమైన చర్చలు జరిపిన మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పైనా తోట త్రిమూర్తులతో చర్చించి సలహాలు తీసుకున్నట్టు వెల్లడించారు.

అధిష్టానం తనను గౌరవించింది కాబట్టే.. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు వచ్చానని ఆమంచి తెలిపారు.  చంద్రబాబుతో చర్చల తర్వాత తాను సంతృప్తి చెందినట్లు చెప్పిన కృష్ణమోహన్.. అనుచరులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని మరో మెలిక పెట్టారు. దీంతో ఆయన టీడీపీలో కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.

ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు వైసీపీలో చేరతారని అనుకుంటున్న తరుణంలో సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కృష్ణమోహన్ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో పార్టీ మారే అంశంపై ఆయన డోలాయమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -