నువ్వెలా ఓడిపోయావ్?: రేవంత్‌‌పై రాహుల్, ఓటమిపై ఉత్తమ్ క్షమాపణ, ఖమ్మం నుంచి పోటీకి..

revanth-rahul
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రాష్ట్ర పార్టీ నేతలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాహుల్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు, సమయం, బలమైన శ్రేణులు, మీరు కోరిన విధంగా పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామని రాష్ట్ర పార్టీ నేతలను రాహుల్ ప్రశ్నించారు.

కాగా, టీఆర్ఎస్ ధనప్రవాహం ముందు తట్టుకోలేకపోయామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సి కుంతియా.. రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రాహుల్‌ దానిని కొట్టి పారేశారు. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ విపరీతంగా ఖర్చు పెట్టిందని, అయినా మనం గెలిచామని.. అది సరైన కారణం కాదని రాహుల్ అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలు, ధన ప్రవాహం, అధికార దుర్వినియోగంతో నష్టపోయామని చెప్పారు. గెలుపుపై మీ నమ్మకాన్ని నిలబెట్టనందుకు తమను క్షమించాలని కోరారు.

ఇది ఇలా ఉంటే, కీలకమైన ఎన్నికల సమయంలో నాయకత్వ లోపం ఎక్కువగా ఉందని.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను వెంటనే మార్చాలని మంథని, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సుధీర్‌రెడ్డి.. రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. టికెట్ల కేటాయింపులో విపరీతమైన జాప్యం జరిగిందని.. టీడీపీతో పొత్తు వల్ల ఇబ్బందులు లేకపోయినా చంద్రబాబు ఎక్కువగా ప్రచారం చేయడంతో కేసీఆర్‌ దానిని అవకాశంగా మలుచుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు త్వరగా పూర్తి చేయాలని.. అప్పుడే అభ్యర్థులు ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులంతా నామమాత్రంగా వ్యవహరించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఒక్క పీసీసీ అధ్యక్షుడు సరిపోయారు.. ఇంత చిన్న రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు.. నలుగురైదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు అనవసరమని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాహుల్‌కు చెప్పారు. ఒక్కరికే బాధ్యతలు అప్పజెప్పి అధిష్ఠానం సమన్వయం చేస్తే సరిపోతుందన్నారు. ఆయనకు మరికొంతమంది నేతలు మద్దతుగా నిలిచారు. కాగా, లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాలని, వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని నేతలకు రాహుల్ సూచించారు.

రాహుల్ జీ ఖమ్మం నుంచి పోటీ చేయండి: పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉంది.. ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా మీరు పోటీ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. నరేంద్ర మోడీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నందున మీరూ రెండు స్థానాల్లో పోటీ చేయాలని.. అందులో ఒకటి ఖమ్మం కావాలన్నారు. అయితే, దీనిపై రాహుల్ గాంధీ నవ్వేసి.. సరే చూద్దాం లే.. అని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు దేశహితం దృష్ట్యా జరిగేవి కనుక పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ఉంటుందని.. టీఆర్ఎస్ కన్నా బీజేపీపైనే దృష్టి పెట్టాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

రేవంత్ ఓటమిపైనా చర్చ

కాంగ్రెస్ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ‘నువ్వెలా ఓడిపోయావ్)’ అని రాహుల్ గాంధీ అడగడం గమనార్హం. ధనప్రవాహం, అధికార దుర్వినియోగం.. చివరి రోజుల్లో ప్రచారానికి తగిన సమయం కేటాయించలేకపోవడం ఓ కారణమని రేవంత్‌ పార్టీ అధినేతకు చెప్పారు. కాగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి, రాహుల్‌ ప్రధాని అయ్యేందుకు తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలని నిర్ణయించుకున్నామన్నారు. సమావేశంలో పొత్తుల కొనసాగింపుపై చర్చ జరగలేదని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సమర్థంగా ముందుకు వెళ్లాలని సూచించారన్నారు ఉత్తమ్. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి తుది కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోనే సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.

సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌ రాజు, శ్రీనివాస కృష్ణన్‌, సలీం అహ్మద్‌, మధు యాస్కీ గౌడ్‌, మండలి శాసనసభ పక్ష నేత షబ్బీర్‌ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి, ఎమ్మెల్యేలు సీతక్క, సబితా ఇంద్రారెడ్డి, బాణోత్‌ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లమడుగు సురేందర్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), కందాళ ఉపేందర్‌రెడ్డి (పాలేరు), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌) హాజరు కాలేదు.

- Advertisement -