23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మా వాళ్లను వేధిస్తారా? భారతదేశంలోనే ఉన్నామా?: చంద్రబాబుపై తలసాని ఫైర్

మా వాళ్లను వేధిస్తారా? భారతదేశంలోనే ఉన్నామా?: చంద్రబాబుపై తలసాని ఫైర్

- Advertisement -

talasani srinivas yadav

విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి వెళితే.. యాదవ సంఘాల నాయకులను, తన వారిని వేధించడం ఏంటని మండిపడ్డారు. ఆయన గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో ప్రభుత్వ పాలన ఆశాజనకంగా లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన చూస్తుంటే.. మనం భారతదేశంలో ఉన్నామా? లేక వేరే దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ప్రజాస్వామ దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చని తలసాని పేర్కొన్నారు. గతంలో తాను ఏపీకి వచ్చి వెళ్లాక మావాళ్లను వేధించారని ఆయన అన్నారు.

హైదరాబాద్‌కు కూడా చాలమంది ఏపీ మంత్రులు వస్తారని, వారిని పోలీసులు ఎందుకు వచ్చారని అడగరని అన్నారు. హాయ్‌ల్యాండ్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్ అనుకుంటే ఇంటెలిజెన్స్ నుంచి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. అంతేగాకుండా హాయ్‌ ల్యాండ్‌లో బస చేస్తున్నానని హాయ్‌ ల్యాండ్ యాజమాన్యంను కూడా పోలీసులు బెదిరించారన్నారు. తాను ప్రెస్‌మీట్‌ పెట్టిన హోటల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి చేశారని, ఏపీలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని అన్నారు. ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని తలసాని ఆరోపించారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా.. ఇక్కడి పాలకుల్లా దిగజారుడు రాజకీయాలను తామెన్నడూ చేయలేదని తలసాని అన్నారు. మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని విమర్శించారు. తెలంగాణలో తాము 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామని, ఏపీలో మాటలు చెబుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదని అన్నారు.

టీడీపీని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పెట్టారు: చంద్రబాబుపై తలసాని

ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న డబ్బులన్నీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకేనని, ఎన్నికల తరువాత చేతులెత్తేస్తారని తలసాని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు. ఏపీని సింగపూర్ చేస్తానని అంటూ, అమరావతిలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని తలసాని విమర్శించారు. ‘హైదరాబాద్‌ని నేనే కట్టానని చెప్పే చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ఎందుకు కట్టలేకపోతున్నారు’ అని సూటిగా ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై హోదా కోసం పోరాటం అంటున్నారని మండిపడ్డారు.

పాడి పరిశ్రమ మీద నిర్లక్ష్యం చూపుతున్నారని, కేంద్రం పాడి పరిశ్రమ అభివృద్ధికి కౌంటర్‌ గ్యారెంటీ అడిగితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు.. హెరిటేజ్ ఎలా లాభాల్లో ఉందో పాడి రైతులకు కూడా వివరించాలని తలసాని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇస్తామని చెప్పిన పదివేల రూపాయల పై కూడా ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను కూడా ఏపీ సర్కార్ పక్కదోవ పట్టించిందన్నారు. కాపులను మోసం చేసేందుకు దీనిలో 5 శాతం రిజర్వేషన్ కేటాయించినట్లు ప్రకటించిందన్నారు. ఇక పసుపు-కుంకుమ బోగస్‌ అని అన్నారు.

చంద్రబాబు బీసీలను అన్నివిధాలుగా తొక్కేశారని, అందుకే యాదవులు, బీసీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పెడుతున్న పప్పు బెల్లాలు ఎన్నికల వరకే పరిమితమని అన్నారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, ఇప్పుడు అదే పార్టీని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీలను కదిలిస్తామని…ఈ సందర్భవంగా గుంటూరులో యాదవ, బీసీ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

చదవండి: కేసీఆర్ నిన్ను ‘థూ నీ బతుకు చెడ’ అనడంలో తప్పులేదు: చంద్రబాబుపై కన్నా ఫైర్

- Advertisement -