
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలంగాణలో ఏం పని అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే తప్పేంటని నిలదీశారు. ఏ తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెబుతూ..‘అమరావతికి ఓ అమెరికా పౌరుడు వచ్చి పర్సు పోగొట్టుకుంటే అమరావతిలో ఫిర్యాదు చేయాలా? అమెరికాలో ఫిర్యాదు చేయాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే తెలంగాణ పోలీసులు చర్యలు చేపడితే తప్పేంటని ప్రశ్నించారు.
అసలు ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి? అని కేటీఆర్ నిలదీశారు. ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చేయాల్సిందంతా చేసి తెలంగాణ ప్రభుత్వంపై నెట్టడమేంటి? అని మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అని నిలదీశారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని, ఐటీ చట్టం ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజల డేటాతో ఏం అవసరం.. సానుభూతి కోసమే సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలపైనా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ శాసనసభ్యులను ఎంతకు కొన్నారో సీఎం చెప్పాలి అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారని, అవసరమైతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.
ఉత్తమ్ వీటిని పట్టించుకోకుండా టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో యూపీలో బీజేపీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ చేరారని, దానిపై మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంతకు కొన్నారు? అంతకుముందు పలువురు టీఆర్ఎస్‌కు చెందిన నేతలు, టీడీపీకి చెందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు వారికి ఎంత ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబునాయుడు పార్టీ మారలేదా? చంద్రబాబునాయుడే పెట్టించారా తెలుగుదేశం పార్టీని అని కేటీఆర్ ప్రశ్నించారు.








