23.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గద్దల్లా వాలిందెవరు బాబూ! కేసీఆర్ పోరాడుతుంటే.. సిగ్గుచేటంటూ టీడీపీ అధినేతను ఏకిపారేసిన కేటీఆర్

గద్దల్లా వాలిందెవరు బాబూ! కేసీఆర్ పోరాడుతుంటే.. సిగ్గుచేటంటూ టీడీపీ అధినేతను ఏకిపారేసిన కేటీఆర్

- Advertisement -

chandrababu-ktr

హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.

గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..
నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు ఇతరులను బూచిగా చూపి ప్రజలను గందరగోళపరిచేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ ప్రజలకు వ్యతిరేకం కాదు

ఏపీ, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కేటీఆర్‌ స్పష్టంచేశారు. తాము ఎక్కడా ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర సోదరులను ఎంతో గౌరవించామని, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ సీమాంధ్రులు కేసీఆర్‌కి ఓటు వేసి గెలిపించారంటేనే… వాళ్లని తాము ఎలా గుండెల్లో పెట్టి చూసుకున్నామో అర్థం అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గద్దల్లా వాలింది ఎవరు బాబూ?

దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏకమై ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని, దీనికోసమే ఆయన దేశవ్యాప్తంగా తిరిగి అందరి మద్దతు కూడగడుతున్నారని కేటీఆర్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌ కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ యత్నాలను చూసి చంద్రబాబునాయుడు గంగవెర్రులెత్తుతున్నారని ధ్వజమెత్తారు. గద్దల్లా వచ్చి వాలుతున్నారని చంద్రబాబు తన అనుకూల మీడియాతో రాయిస్తున్నారని.. అయితే ఎవరు గద్దల్లా వాలారు? అని కేటీఆర్ నిలదీశారు. టీఆర్ఎస్‌నుఓడించేందుకు కాంగ్రెస్‌తో 30 ఏళ్ల వైరాన్ని మరిచి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో సోనియా గాంధీని ఇటలీ మాఫియా అన్న చంద్రబాబు ఆ పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

బీజేపీతో తమకు ఏదో సంబంధం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించడమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీని చిత్తుగా ఓడించింది తమ పార్టీయేనని చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్ఎస్ గెలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందన్నారు.

ఇది ఇలావుంటే.. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇతర నేతలతో కలిసి శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రతాప్‌రెడ్డికి హామీ ఇచ్చారు. కాగా, తనకు ఇక నుంచి కేసీఆరే బాస్ అని, ప్రజలు ఆయన వెంటే ఉన్నారని వంటేరు పార్టీలో చేరుతున్న సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

- Advertisement -