
బిషోఫ్టు: ఇథియోపియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలడం నలుగురు భారతీయులతోపాటు 157 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 149 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 8 మంది సిబ్బంది. మృతుల్లో ఏపీకి చెందిన ఓ యువ వైద్యురాలు కూడా ఉన్నారు. ప్రమాదానికిగల కారణాలు తెలియరాలేదు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వరంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్(ఈఏ)కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం దేశ రాజధాని అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8:38 గంటలకు గాల్లోకి ఎగిరింది. కెన్యా రాజధాని నైరోబీకి అది వెళ్లాల్సి ఉంది. అయితే, 8:44 గంటలకు రాడార్‌తో దాని సంబంధాలు తెగిపోయాయి.
అడిస్ అబాబాకు దక్షిణాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో బిషోఫ్తు పట్టణ సమీపంలోని హెజెరె ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని వారంతా మృత్యువాతపడ్డారని ఈఏ, ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ఈబీసీ) వెల్లడించాయి. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తాము ఆపదలో ఉన్నామని, వెనక్కి రావాలనుకుంటున్నామని పైలట్ నుంచి సందేశం వచ్చిందని ఈఏ తెలిపింది.
వెనక్కి వచ్చేందుకు తాము అనుమతి ఇచ్చామని, అంతలోనే దుర్ఘటన చోటుచేసుకుందని పేర్కొంది. విమాన ప్రమాద మృతుల్లో 33 దేశాలకు చెందినవారున్నారు. వారిలో అత్యధికంగా 32 మంది కెన్యా పౌరులున్నారు. దేశాల వారీగా కెనడా(18 మంది), ఇథియోపియా(9), చైనా(8), అమెరికా(8), ఇటలీ(8), ఫ్రాన్స్(7), బ్రిటన్(7), ఈజిప్టు(6), నెదర్లాండ్స్(5), భారత్(4), స్లొవేకియా(4) దేశస్థులతోపాటు పలు ఇతర దేశాల పౌరులు మృతిచెందినవారిలో ఉన్నారు.
ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వైద్యురాలు
ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన యువ వైద్యురాలు నూకవరపు మనీషా దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె మనీషా. గుంటూరు వైద్య కళాశాలలో నాలుగేళ్ల క్రితం ఆమె వైద్య విద్యనభ్యసించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
మనీషా అక్క లావణ్య నైరోబీలో నివాసముంటున్నారు. 10 రోజుల క్రితం లావణ్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా బయలుదేరారు. అమెరికా నుంచి ఇథియోపియాకు వెళ్లి, అక్కడి నుంచి నైరోబీకి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మనీషా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే గుంటూరు నగరంలోని నవభారత్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆమె మృతితో ఆమె కుటుంబంతోపాటు స్థానికులు కూడా విషాదంలో మునిగిపోయారు. కాగా, మనీషా తల్లిదండ్రులు నెలరోజులుగా పెద్ద కుమార్తె వద్దే ఉంటున్నారు.
ఇది ఇలా ఉండగా, ఇథియోపియా విమాన ప్రమాదంలో మనీషాతోపాటు మనదేశానికి చెందిన వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
కాగా, ఆఫ్రికాలో ఉత్తమ విమానయాన సేవలు అందించే సంస్థగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు పేరుంది. ప్రమాదానికి గురైన విమానం కొత్తది. గత ఏడాది నవంబరులోనే అది ఈఏ చేతికి అందింది. గత ఏడాది అక్టోబరులో బోయింగ్ 737-8 మాక్స్ తరగతికే చెందిన ఓ విమానం ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. నాటి దుర్ఘటనలో 189 మంది మరణించిన విషయం తెలిసిందే.








