
విజయవాడ- 9 ఆగస్టు, 2026: అవకాశాలు కల్పిస్తే గిరిజన బిడ్డలు కూడా అద్భుతాలు చేయగలరని, వారికి ఆ సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల బిడ్డలు చదువులో రాణించి ఐఐటీలకు వెళ్లాలని, దేశానికి వారి సేవలు ఉపయోగపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
దేశం మనకు ఏమిచ్చిందనేది కాదు.. దేశానికి మనం ఏమిచ్చామనే ఆలోచన అందరూ పెంపొందించుకోవాలని సీఎం అభిలషించారు.
అరకు కాఫీని ప్రోత్సహించి ప్రపంచ స్థాయికి తీసుకెళుతున్నామని చంద్రబాబు చెప్పారు. దీనిని గ్లోబల్ బ్రాండ్‌గా చేస్తామని, ఢిల్లీలోని పార్లమెంట్‌లోనూ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.
మన అరకు కాఫీ బాగుందని సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని, మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఆయన దీని గురించి ప్రస్తావించారని సీఎం చంద్రబాబు వివరించారు.
‘‘గిరిజనులకు న్యాయం చేసిన తొలి పార్టీ టీడీపీయే..’’
గిరిజనులకు న్యాయం చేసిన తొలి పార్టీ టీడీపీయే అని చెబుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో.. 2000 సంవత్సరంలో.. గిరిజనుల ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 3 ని తీసుకొచ్చామని తెలిపారు.
ఈ జీవో దాదాపు 20 ఏళ్ల పాటు అమలులో ఉందని, అయితే 2020లో వైసీపీ హయాంలో ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసిందని చెబుతూ.. దీన్ని కాపాడటంలో వైసీపీ విఫలం చెందిందని చంద్రబాబు వ్యాఖ్యానిచారు.
అంతకుముందు.. కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి ఆదివాసీలు కొమ్ము, బంజారా, థింసా నృత్యాలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు డప్పు వాయిస్తూ.. గిరిజన బాలికలతో నృత్యం చేశారు.
గిరిజన బిడ్డలు ఆవేశానికి లోనుకాకుండా ఆలోచన చేయాలని, తమ ప్రభుత్వం ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుందని, మళ్లీ గిరిజనులకు ఉద్యోగాల్లో లబ్ధి కలిగేలా అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం చంద్రబాబు సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు వివిధ ప్రైవేటు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.








